వారాహి రూట్ మ్యాప్ రెడీ.. పవన్ ఎంట్రీ ఎప్పుడంటే..?
క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు.. ఎక్కువ సమయం పవన్, ప్రజలతో గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు.
ఎన్నికల ప్రచారం కోసం పవన్ కల్యాణ్ ప్రత్యేకంగా తయారు చేయించుకున్న వారాహి వాహనం ఎట్టకేలకు రోడ్డెక్కబోతోంది. ఆమధ్య పూజా కార్యక్రమాలు చేసి ఆ తర్వాత కొన్నిరోజులు గ్యాప్ ఇచ్చిన పవన్.. ఇప్పుడు ప్రచార పర్వాన్ని మొదలు పెట్టేందుకు సిద్ధమయ్యారు. ఈనెల 14నుంచి పవన్ కల్యాణ్ వారాహి యాత్ర మొదలవుతుందని చెప్పారు జనసేన పార్టీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్.
వారాహి రూట్ మ్యాప్..
ఈనెల 14న తూర్పు గోదావరి జిల్లాలో అన్నవరంలో సత్యదేవుని దర్శించుకున్న తరువాత జనసేనాని పవన్ కల్యాణ్ వారాహి యాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు నాదెండ్ల మనోహర్. తూర్పుగోదావరి జిల్లాలో ప్రత్తిపాడు, పిఠాపురం, కాకినాడ రూరల్, కాకినాడ అర్బన్, ముమ్మిడివరం, పి గన్నవరం, రాజోలు నియోజకవర్గాల్లో పవన్ పర్యటన ఉంటుందని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లాలో పాలకొల్లు, నర్సాపురం, భీమవరంలో వారాహి యాత్ర కొనసాగుతుందన్నారు. క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకునేందుకు, ఎక్కువ సమయం పవన్, ప్రజలతో గడిపేలా జనసేన నేతలు రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. పవన్ వారాహి యాత్రపై ఉభయ గోదావరి జిల్లాల పార్టీ అధ్యక్షులు, పీఏసీ సభ్యులతో మంగళగిరిలోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో నాదెండ్ల మనోహర్ చర్చించారు. పవన్ యాత్రకు ఆటంకం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జనసేన శ్రేణులకు ఆయన సూచించారు.
విమర్శలకు చెక్ పెట్టేందుకేనా..?
యువగళం వల్లే వారాహి ఆగిపోయిందని, టీడీపీకి మేలు చేకూర్చడానికే పవన్ బయటకు రావట్లేదని వైసీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు. మరోవైపు పవన్ వరుస సినిమాలతో బిజీ కావడంతో అసలు వారాహి రోడ్డెక్కే పరిస్థితే లేదనే గుసగుసలు కూడా వినపడుతున్నాయి. ఈ దశలో పవన్ రాజకీయ పర్యటన ఖరారు కావడం, రూట్ మ్యాప్ కూడా రెడీ కావడంతో జనసైనికులు సంబరాలు చేసుకుంటున్నారు.