ఏపీనే డబ్బులివ్వడం లేదు- రైల్వే మంత్రి

ఎంపీ బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పిస్తే గొప్ప సహాయం చేసిన వారవుతారని కూడా కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు.

Advertisement
Update:2022-07-28 08:07 IST

ఏపీలో రైల్వే ప్రాజెక్టుల జాప్యానికి కారణాన్ని రాష్ట్ర ప్రభుత్వంపైకి నెట్టేసింది కేంద్రం. ఏపీ ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను ఇవ్వడం లేదని అందుకే రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం ఏపీలో ఆలస్యం అవుతోందని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ లోక్‌సభలో ప్రకటించారు.

మచిలీపట్నం- రేపల్లె మధ్య కొత్త రైల్వే లైన్ నిర్మాణంపై వైసీపీ ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా కేంద్రమంత్రి ఈ విషయం చెప్పారు. ఏపీలో మొత్తం 70వేల కోట్ల రూపాయల విలువైన కొత్త ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతోందని.. కానీ ఏపీ ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులను మాత్రం ఇవ్వడం లేదన్నారు. రాష్ట్రం ఇప్పటికే 1798 కోట్ల రూపాయలు ఇవ్వాల్సి ఉందని కేంద్రమంత్రి చెప్పారు.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి సరైన సహకారం లేదు కాబట్టి ఏపీలో కొత్త ప్రాజెక్టులు చేపట్టడం సాధ్యం కాదని తేల్చేశారు. ఎంపీ బాలశౌరి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడి ఆ డబ్బులు ఇప్పిస్తే గొప్ప సహాయం చేసిన వారవుతారని కూడా కేంద్రమంత్రి విజ్ఞప్తి చేశారు. అలా చేయగలగితే ఏపీలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం వేగవంతం చేయడానికి అవకాశం ఉంటుందన్నారు.

విజయవాడ- గుడివాడ- భీమవరం- నరసాపురం.., గుడివాడ- మచిలీపట్నం డబ్లింగ్‌ ప్రాజెక్టుపై స్పందించిన కేంద్రమంత్రి.. ఈ ప్రాజెక్టును 4వేల 106 కోట్ల రూపాయలతో చేపట్టామని.. ఇందులోనూ రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 50 శాతం నిధులు జమ చేయాల్సి ఉందని.. కానీ ఇప్పటి వరకు రాష్ట్రం కేవలం రూ. 289 కోట్లు మాత్రమే డిపాజిట్ చేసిందని రైల్వే మంత్రి వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News