బ్రోకర్లు ఎందుకు..? మాకామాత్రం శక్తి లేదా..? - కిషన్ ఎదురుదాడి

ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలనుకుంటే బహిరంగంగానే చేర్చుకుంటామని చెప్పారు. స్వామీజీలను, బ్రోకర్లు పంపి డబ్బులు ఇచ్చి చేర్పించుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు.

Advertisement
Update:2022-11-04 13:23 IST

టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించి ఆడియో, వీడియోలతో బ్రోకర్లు దొరికిన వైనంపై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఎదురుదాడి చేశారు. తీవ్రతను తక్కువ చేసి చూపే ప్రయత్నం చేశారు.

తెలంగాణ రత్నాలు అంటున్న నలుగురు ఎమ్మెల్యేల్లో ముగ్గురు ఏ పార్టీ నుంచి గెలిచారో సమాధానం చెప్పాలన్నారు. ఇతర పార్టీల్లో గెలిచిన ఆ ముగ్గురు నేడు తెలంగాణ రత్నాలు ఎలా అయ్యాయో సమాధానం చెప్పాలన్నారు. గతంలో ప్రత్యేక హోదా పేరుతో ఎన్నికల ముందు టీడీపీ ఏ విధంగా అయితే బీజేపీపై బురదజల్లే ప్రయత్నం చేసిందో ఇప్పుడు అదే పనిని ప్రభుత్వాన్ని కూల్చేస్తున్నారంటూ కేసీఆర్ చేస్తున్నారని విమర్శించారు.

ఇతర పార్టీల నుంచి అనేక మంది ఎమ్మెల్యేలను చేర్చుకున్న కేసీఆర్‌.. ఒక్కరితోనైనా రాజీనామా చేయించారా అని ప్రశ్నించారు. ఒకవేళ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలనుకుంటే తమకు ఆ మాత్రం శక్తి లేదా.. ఆపని చేయడానికి స్వామీజీలు, బ్రోకర్లు మధ్యలో తమకు అవసరం లేదన్నారు.

ఇతర పార్టీల నేతలను చేర్చుకోవాలనుకుంటే బహిరంగంగానే చేర్చుకుంటామని చెప్పారు. స్వామీజీలను, బ్రోకర్లు పంపి డబ్బులు ఇచ్చి చేర్పించుకోవాల్సిన కర్మ తమకు పట్టలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూలిపోవాలని తాము భావించడం లేదని.. ప్రజాస్వామ్యబద్దంగానే అధికారంలోకి రావాలనుకుంటున్నామని చెప్పారు. షెడ్యూల్ ప్రకారం 2023లోనే ఎన్నికలు జరగాలన్నది తమ ఆకాంక్ష అన్నారు.

వీడియోలున్నాయని అంటున్నారు అందులో పార్టీ నేతలు ఎక్కడున్నారని కిషన్ రెడ్డి ఎదురుదాడికి దిగారు. వైసీపీ నుంచి ముగ్గురిని, బీఎస్పీ నుంచి ఇద్దరిని టీఆర్ఎస్‌లో చేర్చుకోలేదా అని ప్రశ్నించారు. టీడీపీ నుంచి ఎంపీగా గెలిచిన మల్లారెడ్డిని ఎలా చేర్చుకున్నారని నిలదీశారు. టీడీపీ నుంచి అనేక మంది ఎమ్మెల్యేలను టీఆర్‌ఎస్‌లో చేర్చుకోలేదా అంటూ కిషన్ ఎదురుదాడి చేశారు.

Tags:    
Advertisement

Similar News