మా దయతోనే ఏపీ అభివృద్ధి.. బీజేపీ సెల్ఫ్ డబ్బా

త్వరలో రూ. 12,911 కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం కేంద్రం ఇవ్వబోతున్నట్టు కూడా బీజేపీ నేతలు వెల్లడించారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతోందన్నారు.

Advertisement
Update:2023-06-02 13:48 IST

ఏపీలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. అభివృద్ధి చేసినా, అరాచకం చేసినా.. మొత్తం క్రెడిట్ అంతా జగన్ కే దక్కుతుంది. కాదు కాదు ఏపీ అభివృద్ధి అంతా మా దయే అంటున్నారు బీజేపీ నేతలు. కేంద్రం ఇచ్చే ప్రధాన పథకాల్లో ఏపీకి చేకూరినంత లబ్ధి మరెవరికీ దక్కలేదన్నారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. ఏపీకి కేంద్రం పెద్ద ఎత్తున నిధులు ఇస్తోందన్నారు.

గుట్టుగా తెచ్చుకున్నారట..!

కేంద్రం ఇచ్చే నిధుల్ని ఏపీ ప్రభుత్వం గుట్టుగా తెచ్చుకుందని అంటున్నారు జీవీఎల్. పోనీ గుట్టుగా తెచ్చుకుంటే, దాన్ని రట్టు చేసి ఆ క్రెడిట్ అంతా తమదే అని ఏపీ బీజేపీ నేతలు చెప్పుకోవచ్చు కదా. కాస్త ఆలస్యంగా అయినా ఆ పని మొదలుపెట్టినట్టున్నారు బీజేపీ నేతలు. ఏపీకి ప్రధాని మోదీ ప్రకటించిన కొత్త వరాలు ఇవేనంటూ ప్రకటించారు ఎంపీ జీవీఎల్.

ఏపీకి రెవెన్యూ డెఫిసిట్ రూ. 10 వేల కోట్లు ఇచ్చారన్నారు. స్పెషల్ ఇన్సెంటివ్స్ ప్యాకేజీ రూపంలో రూ. 10 వేల కోట్లకు పైగా నిధులిచ్చామని చెప్పారు. 2016 నుంచి ఇప్పటి వరకు రూ. 16,984 కోట్లు అదనపు రుణాన్ని అప్పటి టీడీపీ, ఇప్పటి వైసీపీ ప్రభుత్వాలు తెచ్చుకున్నాయని చెప్పారు. కేంద్రం అప్పులపై పరిమితి విధించిందని, ఈ ఏడాది కూడా రూ. 8 వేల కోట్లు కోత విధించాల్సి ఉన్నా.. రాష్ట్ర ప్రభుత్వం కోరిక మేరకు మూడేళ్లల్లో సర్దుబాటు చేసేలా వెసులుబాటు కల్పించిందని వివరించారు జీవీఎల్. ఈ ఏడాది రూ. 2667 కోట్ల మాత్రమే కోత విధించి.. సుమారు రూ. 5 వేల కోట్ల మేర రుణ వెసులుబాటు కల్పించామన్నారు. ఈ నిధులను కేంద్రం నుంచి గుట్టుగా తెచ్చుకుని తామేదో ప్రజలకు సేవ చేసినట్టుగా వైసీపీ చెప్పుకుంటోందని ఆయన మండిపడ్డారు. తాము నిధులివ్వకుంటే వైసీపీ ఏం చేస్తుందని ప్రశ్నించారు జీవీఎల్.

త్వరలో రూ. 12,911 కోట్లకు పైగా నిధులు పోలవరం కోసం కేంద్రం ఇవ్వబోతున్నట్టు కూడా బీజేపీ నేతలు వెల్లడించారు. త్వరలో కేంద్ర కేబినెట్‌లో నిర్ణయం తీసుకోబోతోందన్నారు. పోలవరంలో పూర్తి స్థాయి నీటి నిల్వ చేసుకునేలా అవసరమైన నిధులు, అనుమతులు, అంతరాష్ట్ర వివాదాలను కేంద్రం పరిష్కరిస్తుందన్నారు. 

Tags:    
Advertisement

Similar News