మార్గదర్శి కేసు.. చంద్రబాబు కోర్టులో బంతి

గతంలో జగన్‌ ఈ కేసులో ఇంప్లీడ్‌ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Advertisement
Update:2024-08-21 13:17 IST

మార్గదర్శి ఫైనాన్షియర్స్ పేరుతో అక్రమంగా డిపాజిట్లు సేకరించారన్న కేసులో ఇటీవల కీలక పరిణామం చోటు చేసుకున్న విషయం తెలిసిందే. మార్గదర్శి డిపాజిట్లు సేకరించడం చట్టానికి విరుద్ధం అని తెలంగాణ హైకోర్టులో ఆర్బీఐ అఫిడవిట్ దాఖలు చేసింది. మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్‌లోని సెక్షన్‌-45 వర్తిస్తుందని రిజర్వ్‌ బ్యాంకు తన కౌంటర్‌లో హైకోర్టుకు తెలిపింది. దీంతో ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చినట్టయింది. మార్గదర్శి చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అయితే ఇందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు కూడా హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని కోరారు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.

మార్గదర్శి కేసుపై తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నుంచి కనీస స్పందన లేదని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. కనీసం తెలంగాణ హైకోర్టు తాజా ఆదేశాల నేపథ్యంలోనైనా వారిద్దరూ స్పందిస్తారో లేదో చూడాలని అన్నారాయన. గతంలో జగన్‌ ఈ కేసులో ఇంప్లీడ్‌ కావడం బలాన్నిచ్చిందని, ఇప్పుడు చంద్రబాబు ఏం చేస్తారో చూడాలని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఉండవల్లి.

తాజాగా ఆర్బీఐ సబ్మిట్ చేసిన అఫిడవిట్‌తో తాను గతంలో చెప్పింది నిజమేనని తేలిందని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. మార్గదర్శిపై తన పోరాటాన్ని మరోలా వక్రీకరించారని చెప్పారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి చెప్పటం వల్లే తాను అలా చేశానని అందరూ అనుకున్నారని, కానీ అది వాస్తవం కాదన్నారు. మార్గదర్శి చిట్ ఫండ్స్ తనపై 50 లక్షలు పరువు నష్టం దావా వేసిందని గుర్తు చేశారు ఉండవల్లి. తెలంగాణ హైకోర్టులో అది ఇంకా పెండింగ్ లోనే ఉందని, మార్గదర్శి చిట్‌ఫండ్‌ వ్యవహారం ఒక కొలిక్కి వస్తే ఆ కేసు కూడా పూర్తవుతుందన్నారు. ఆర్బీఐ తన అఫిడవిట్ సమర్పించింది కాబట్టి, వాస్తవం ఏంటో చెప్పాల్సిన బాధ్యత ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులపై ఉందని తేల్చి చెప్పారు ఉండవల్లి అరుణ్ కుమార్. 

Tags:    
Advertisement

Similar News