రాహుల్ బికేమ్ ఎ రియల్ గాంధీ -ఉండవల్లి

కర్నాటక అసెంబ్లీ ఫలితాలు దేశ ప్రజలందరిలో ఆశలు రేకెత్తించాయని, వచ్చేసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని, తాను బలంగా అదే కోరుకుంటున్నానని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్.

Advertisement
Update:2023-05-19 13:00 IST

రాష్ట్ర వ్యవహారాలు, అందులోనూ ముఖ్యంగా మార్గదర్శి గురించి ప్రెస్ మీట్లు పెట్టి వాయించేందుకు మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆసక్తి చూపిస్తుంటారు. ఈసారి కూడా చిట్ ఫండ్ వ్యవహారాలపై ఆయన స్పందించారు, అయితే అనుకోకుండా రాహుల్ గాంధీ ప్రస్తావన వచ్చింది. తాను గతంలో చూసిన రాహుల్ కు, ఇప్పటి రాహుల్ కి చాలా తేడా ఉందని చెప్పుకొచ్చారు ఉండవల్లి. 'రాహుల్ బికేమ్ ఎ రియల్ గాంధీ' అని కితాబిచ్చారు.

ఇటీవల తాను ఢిల్లీకి వెళ్లినప్పుడు విమానంలో రాహుల్ గాంధీ పక్క సీట్లో కూర్చున్న సందర్భాన్ని ఉండవల్లి గుర్తు చేశారు. ఆ సందర్భంగా ఆయనతో మాట్లాడిన విషయాలు, ఆయన ప్రతిస్పందన గురించి మీడియాకి వివరించారు. పదేళ్ల క్రితం తాను ఎంపీగా పనిచేసిన విషయాన్ని కూడా రాహుల్ గుర్తు పెట్టుకున్నారని చెప్పారు. గాంధీ కుటుంబంలోని చాలామంది నేతలకు తాను ట్రాన్స్ లేటర్ గా పనిచేసిన విషయాన్ని గుర్తు చేయగా.. ఆయన మరింత ఆప్యాయత చూపించారన్నారు. విమానంలో ఉన్నవారందరితోనూ రాహుల్ అంతే అభిమానంగా ఉన్నారని చెప్పారు ఉండవల్లి.

విమానం ఎక్కే సమయంలో రాహుల్ పై వ్యతిరేక భావన ఉన్నవారు కూడా, దిగే సమయానికి ఆయనకు స్నేహితులుగా మారిపోయారని, రాజీవ్ గాంధీలో ఉన్న ఆకర్షణ రాహుల్ లో కూడా తాను చూశానన్నారు. అవినీతికి పాల్పడాల్సిన అవసరం అసలు గాంధీ కుటుంబానికి లేదన్నారు ఉండవల్లి. గాంధీ కుటుంబంపై చాలా రకాల ఆరోపణలు వచ్చినా, అవినీతి ఆరోపణలను మాత్రం ఎవరూ రుజువు చేయలేరని చెప్పారు.

కాంగ్రెస్ అధికారంలోకి రావాలి, వస్తుంది..

కర్నాటక అసెంబ్లీ ఫలితాలు దేశ ప్రజలందరిలో ఆశలు రేకెత్తించాయని, వచ్చేసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశముందని, తాను బలంగా అదే కోరుకుంటున్నానని అన్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. బలమైన ప్రతిపక్షం ఉంటేనే ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతుందని, ఈరోజుల్లో ప్రతిపక్షంలో ఉండేందుకు ఎవరూ ఇష్టపడటంలేదని, పార్టీ ఓడిపోయిందని తెలిస్తే వెంటనే ప్లేటు ఫిరాయిస్తున్నారని, కానీ ప్రతిపక్షంలో ఉండేందుకు, ప్రజల తరపున పోరాటం చేసేందుకు కాంగ్రెస్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదన్నారు. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ లో నిజమైన మార్పు వచ్చిందని చెప్పారు. ఆయన రియల్ గాంధీగా మారారని ప్రశంసించారు. 

Tags:    
Advertisement

Similar News