ఎమ్మెల్యేల కంటే వాలంటీర్లకే ఎక్కువ అధికారం

ఏపీలో ఎమ్మెల్యేలకు అధికారం లేదని అన్నారు ఉండవల్లి. అధికారమంతా సీఎం జగన్, గ్రామ వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని చెప్పారు.

Advertisement
Update:2023-12-23 14:52 IST

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ అంటే కచ్చితంగా రామోజీ రావుని, మార్గదర్శిని ఎండగడుతూ ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ప్రత్యేకంగా ఏపీ రాజకీయాల గురించి ఆయన స్పందిస్తే మాత్రం సీఎం జగన్ ని కొద్దోగొప్పో సమర్థిస్తూనే మాట్లాడతారు. కానీ ఈసారి మాత్రం పూర్తిగా జగన్ నిర్ణయాలను తప్పుబట్టారు ఉండవల్లి. ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న కొత్త నిర్ణయాలు ఆయన అనుభవలేమికి నిదర్శనం అన్నారు.

సీట్లు మారిస్తే ఓట్లు వస్తాయా..?

సిట్టింగ్ లకు సీట్లు మార్చే ప్రక్రియ సరికాదంటున్నారు ఉండవల్లి అరుణ్ కుమార్. టికెట్లు మార్చకపోవడం వల్ల తెలంగాణలో బీఆర్ఎస్ ఓడిపోయిందని, సీట్లు మార్చితే ఇక్కడ జగన్ గెలుస్తారని అనుకోవడం అపోహేనన్నారు. త్యాగాలు చేయడానికి ఎవరూ రాజకీయాల్లోకి రారని, సీటు లేదని చెబితే అందరూ అధినేత నిర్ణయాన్ని సమర్థిస్తారని అనుకోవడం తప్పు అని చెప్పారు. సీట్లు మార్చడం వల్ల ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరుగుతుందని కూడా పరోక్షంగా హెచ్చరించారు ఉండవల్లి.

ఎమ్మెల్యేలకు అధికారం ఉందా..?

ఏపీలో ఎమ్మెల్యేలకు అధికారం లేదని అన్నారు ఉండవల్లి. అధికారమంతా సీఎం జగన్, గ్రామ వాలంటీర్ల చేతుల్లో మాత్రమే ఉందని చెప్పారు. అప్పులు చేసి సంక్షేమ పథకాల పేరుతో డబ్బులు పంచడం ఎక్కడా చూడలేదని, జగన్ దేశంలోనే గొప్ప ప్రయోగం చేశాని సెటైర్లు పేల్చారు. పవన్ కల్యాణ్, చంద్రబాబు కలయిక కచ్చితంగా ఆ రెండు పార్టీలకు బలమే అవుతుందని విశ్లేషించారు. అంతే కాదు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పుంజుకుంటుందని కూడా జోస్యం చెప్పారు ఉండవల్లి. వైసీపీ ఎమ్మెల్యేల పరిస్థితి, ఎమ్మెల్యేల స్థాన చలనంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. 

Tags:    
Advertisement

Similar News