మేనమామ అత్యాచారయత్నం.. ఐదు నెలలు మృత్యువుతో పోరాడి ఓడిన బాలిక

బాలిక కేకలు పెడుతుండటంతో ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. ఆమె బాధతో విలవిలలాడిపోయింది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు బాలికను మొదట నెల్లూరులోని ఒక ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు.

Advertisement
Update:2023-02-01 13:16 IST

అమ్మకు సోదరుడు అయిన మేనమామ.. అమ్మ నాన్నల తర్వాత అంతటి ప్రేమాభిమానాలను పంచుతాడంటాడు. తండ్రి తర్వాత అంతటి స్థానంలో ఉంటాడు. అటువంటి మేనమామ మేనకోడలిపై   అత్యాచారయత్నానికి పాల్పడగా, ప్రతిఘటించిందన్న కోపంతో ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. ఐదు నెలలపాటు మృత్యువుతో పోరాడిన బాలిక చివరికి ప్రాణాలు వదిలింది. ఈ దారుణ సంఘటన నెల్లూరు జిల్లాలో జరిగింది.

వెంకటాచలం మండలంలోని ఓ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగికి 14 ఏళ్ల కుమార్తె ఉంది. మొదట ఆ వ్యక్తికి కొడుకు పుట్టగా.. అతడు 18 ఏళ్ల వయసులో మృతిచెందాడు. ఆ తర్వాత చాలా కాలానికి వారికొక కుమార్తె పుట్టింది. దీంతో వారు బాలికను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నారు.

గత ఏడాది సెప్టెంబర్ 5వ తేదీన కుటుంబ సభ్యులు నెల్లూరుకు వెళ్లారు. ఆ సమయంలో ఇంట్లో బాలిక ఒంట‌రిగా ఉంది. మేనమామ వరుస అయ్యే వ్యక్తి ఆ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించాడు. దీంతో బాలిక అతడి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రతిఘటించింది. బాత్‌రూంలోకి వెళ్లి తలుపు గడియ పెట్టుకుంది. అయినా వదలని ఆ వ్యక్తి తలుపులు బద్దలు కొట్టి లోపలికి వెళ్ళాడు.

బాలిక కేకలు పెడుతుండటంతో ఆమె నోట్లో యాసిడ్ పోశాడు. ఆమె బాధతో విలవిలలాడిపోయింది. ఆ తర్వాత అతడు అక్కడి నుంచి పారిపోయాడు. కుటుంబ సభ్యులు బాలికను మొదట నెల్లూరులోని ఒక ఆస్పత్రికి తరలించి ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం చెన్నైకి తీసుకెళ్లారు. ఇక్కడ గత ఐదు నెలలుగా  బాలిక చికిత్స పొందుతోంది. రెండు రోజుల కిందట కూడా వైద్యులు బాలికను పరీక్షించి తొందరలోనే డిశ్చార్జ్ చేస్తామని ప్రకటించారు. రెండు నెలల తర్వాత కాలిన ముఖానికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తామని తెలిపారు. అయితే బాలిక మంగళవారం మృతి చెందింది. కోలుకొని ఇంటికి తిరిగి వస్తుందనుకున్న బాలిక మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈ విషయంపై నెల్లూరు దిశ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.

Tags:    
Advertisement

Similar News