గుండెపోటుతో మరో ఇద్దరు విద్యార్థులు మృతి..
ఒక విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయి.. వారం రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. మరో విద్యార్థి నిద్రలోనే ప్రాణాలు విడిచాడు.
ఇటీవల విద్యార్థుల్లోనూ గుండెపోటు మరణాలు సంభవిస్తుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా మరో ఇద్దరు విద్యార్థులు గుండెపోటుకు గురై మృతిచెందడం వారి కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. ఒక విద్యార్థి కబడ్డీ ఆడుతూ కుప్పకూలిపోయి.. వారం రోజులు ఆస్పత్రిలో మృత్యువుతో పోరాడి ఓడిపోయాడు. మరో విద్యార్థి నిద్రలోనే ప్రాణాలు విడిచాడు.
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రుకు చెందిన ఫిరోజ్‌ఖాన్ (17) చిలకలూరిపేటలోని ఓ ప్రైవేటు జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఎప్పటిలాగే సోమవారం రాత్రి చదువుకుని నిద్రపోయాడు. అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పెద్దగా గురక పెడుతుండటంతో పక్కనే ఉన్న సోదరి ఫర్జానా భయపడి తల్లిదండ్రులకు చెప్పింది. వారు వచ్చి మంచినీరు తాగించేందుకు ప్రయత్నించినా లోపలికి వెళ్లకపోవడంతో హుటాహుటిన చిలకలూరిపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. విద్యార్థిని పరిశీలించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్టు చెప్పారు. తమ కుమారుడు కష్టపడి చదువుకుంటాడని, ఎలాంటి ఒత్తిడి, అనారోగ్యం లేవంటూ తండ్రి వజీర్ బాషా కన్నీరుమున్నీరవుతున్నారు. మెదడుకు, గుండెకు రక్తప్రసరణ పూర్తిగా నిలిచిపోయి ఫిరోజ్‌ఖాన్ మృతిచెందాడని వైద్యులు నిర్ధారించారు.
మరో ఘటనలో..
అనంతపురంలోని ఓ ప్రైవేటు కళాశాలలో బీ ఫార్మసీ చదువుతున్న తనూజ్ నాయక్ (19) ఈనెల ఒకటో తేదీన కబడ్డీ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయినా పరిస్థితి విషమంగా ఉండటంతో.. బెంగళూరులోని ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స అందించినా ఫలితం లేకపోయింది. సోమవారం అర్ధరాత్రి తనూజ్ నాయక్ మృతిచెందాడు. గుండెపోటు వల్లే తమ కుమారుడు మృతిచెందినట్టు వైద్యులు వెల్లడించారని కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీసత్యసాయి జిల్లా మడకశిర మండలం ఇ.అచ్చంపల్లి తండాకు చెందిన వీరి కుటుంబం బెంగళూరుకు వలస వెళ్లింది. తమ కుమారులు ఉన్నత చదువులు చదివి వృద్ధిలోకి వస్తారని ఆశపడిన తల్లిదండ్రులు ఈ ఘటనలతో తల్లడిల్లిపోతున్నారు.