కాకినాడ తీరంలో పెను ప్రమాదం - దగ్ధమైన రెండు బోట్లు.. తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మత్స్యకారులు
ప్రమాదం జరిగిన వెంటనే బోటు నుంచి మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఒడ్డుకు ఈదుకుంటూ రావడంతో వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.
కాకినాడ జిల్లా ఏటిమొగ సముద్ర తీరంలో పెను ప్రమాదం చోటుచేసుకుంది. మత్స్యకారులు ప్రయాణిస్తున్న బోటులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గురువారం తెల్లవారుజామున మత్స్యకారులు వేటకు వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో రెండు బోట్లకు మంటలు వ్యాపించాయి. దీంతో రెండు బోట్లూ పూర్తిగా దగ్ధమయ్యాయి.
వల్లేటి రాముకు చెందిన బోటు, నూకమ్మకు చెందిన బోటు ఈ ప్రమాదంలో పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో దాదాపు రూ.11 లక్షల మేరకు నష్టం వాటిల్లినట్టు సమాచారం. ప్రమాదం నుంచి మత్స్యకారులందరూ క్షేమంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు.
ప్రమాదం జరిగిన వెంటనే బోటు నుంచి మత్స్యకారులు సముద్రంలోకి దూకి ఒడ్డుకు ఈదుకుంటూ రావడంతో వారంతా ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు.