టీ కప్పులో తుపాను.. తిరుమలలో షాపు సీజ్

'ఇట్స్ ఎ టీ షర్ట్' అనే స్లోగన్ ఉన్న పేపర్ టీ కప్పులు తిరుమలలో కనిపించాయి. అందులో తప్పేమీ లేదు కానీ T అనే అక్షరం శిలువ రూపంలో ఉండటంతో గొడవ మొదలైంది.

Advertisement
Update:2023-06-27 15:20 IST

తిరుమలలో అన్యమత చిహ్నాలు, స్టిక్కర్లు, రాజకీయ జెండాలు, పార్టీ కండువాలు కనిపించకూడదనే నిబంధన ఉంది. కానీ కొన్ని కొన్ని సార్లు కొంతమంది పొరపాటున వాటిని కొండపైకి తీసుకొస్తుంటారు. ఉద్దేశపూర్వకంగా చేసినా, అనుకోకుండా జరిగినా తప్పు తప్పే. అందుకే ఇప్పుడో టీ షాప్ ని టీటీడీ అధికారులు సీజ్ చేశారు. టీ కప్పుపై శిలువ గుర్తు ఉండటమే దీనికి కారణం.

టీ కప్పుపై శిలువ..

'ఇట్స్ ఎ టీ షర్ట్' అనే స్లోగన్ ఉన్న పేపర్ టీ కప్పులు తిరుమలలో కనిపించాయి. అందులో తప్పేమీ లేదు కానీ T అనే అక్షరం శిలువ రూపంలో ఉండటంతో గొడవ మొదలైంది. కొంతమంది వినియోగదారులు టీ తాగి ఆ కప్పుని క్షుణ్ణంగా పరిశీలించారు. అది అన్యమత చిహ్నం అని గొడవ చేశారు. వెంటనే అధికారులకు ఫిర్యాదు చేశారు.

తిరుమలలోని 50 నెంబర్ దుకాణంలో ఈ టీ కప్పుల్ని వినియోగించాడు దుకాణదారుడు. కొన్నిరోజులుగా ఆ టీ కప్పులనే వినియోగిస్తున్నాడు. కానీ ఈరోజు ఓ భక్తుడు T అనే అక్షరం శిలువ రూపంలో ఉందని గొడవకు దిగాడు. ఆ భక్తుడి ఫిర్యాదుతో టీటీడీ హెల్త్, రెవెన్యూ సిబ్బంది అక్కడికి వచ్చారు. టీ కప్పుపై శిలువ గుర్తు ఉండటం గమనించారు. యజమానిని ప్రశ్నించారు. ఇందులో తన తప్పేమీ లేదని, ఉద్దేశపూర్వకంగా ఆ పనిచేయలేదని, హోల్ సేల్ దకాణంలో ఆ టీ కప్పులు కొన్నానని చెప్పాడు యజమాని. విచారణ అనంతరం ఆ టీ షాప్ ని అధికారులు సీజ్ చేశారు. షాపులో ఉన్న టీ కప్పుల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇతర మతాల చిహ్నాలు ఉన్న ఏ వస్తువులు కొండపై ఉండకూడదని, వాటిని పైకి తీసుకు రావొద్దని సూచించారు అధికారులు. వ్యాపార కార్యకలాపాల్లో కూడా యజమానులు జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. 

Tags:    
Advertisement

Similar News