అక్రమార్కులపై చర్యలు తీసుకుంటాం -టీటీడీ నూతన ఈఓ

తిరుమలలో ఇప్పటి వరకూ పద్ధతులు సరిగా లేవని, ఇకపై తాము సరిచేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది కొత్త ప్రభుత్వం. అందులో భాగాగంగానే ఈవో మారారు. ఆయన ఆధ్వర్యంలో హడావిడిగా తనిఖీలు జరిగాయి.

Advertisement
Update:2024-06-16 19:28 IST

తిరుమలనుంచే ప్రక్షాళన మొదలు అని సీఎం చంద్రబాబు చెప్పిన తర్వాత టీటీడీకి నూతన ఈఓగా వచ్చిన జె.శ్యామలరావు కూడా అదే రీతిలో మాట్లాడారు. తిరుమలలో తప్పులు జరిగి ఉంటే విచారణ చేపడతామని, అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈరోజు తిరుమలలో ఈవోగా బాధ్యతలు చేపట్టిన అనంతరం వెంటనే తనిఖీలు చేపట్టారు శ్యామలరావు.

తొలిరోజే తనిఖీలు..

ఈవోగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టారు శ్యామలరావు. సర్వదర్శనం క్యూలైన్ లను పరిశీలించి భక్తులతో మాట్లాడారు. క్యూలైన్ల వద్ద పారిశుధ్య నిర్వహణ సరిగా లేదని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మొదటి రోజే టీటీడీ అధికారులకు చుక్కలు చూపించారు ఈవో. క్యూలైన్ల వద్ద భక్తులకు అందించే త్రాగునీరు మురికిగా ఉందని, పరీక్షల నిమిత్తం ల్యాబ్ కి పంపించామని చెప్పారు ఈవో శ్యామలరావు. ఈ విషయంలో హెల్త్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులకు ఈవో మెమోలు జారీ చేస్తారని అంటున్నారు.

క్యూలైన్లో ఉన్నవారికి పాలు సరిగా ఇవ్వడంలేదని, దీనిపై ఫిర్యాదులు అందాయని, పాలు ఎందుకు ఇవ్వడంలేదో విచారణ జరుపుతున్నామని చెప్పారు ఈవో. నడకదారి భక్తులకు కూడా ప్రత్యేక దర్శనం టికెట్లు మంజూరు చేసే విషయంలో సమీక్ష నిర్వహిస్తామన్నారు. మొత్తమ్మీద తిరుమలలో ఇప్పటి వరకూ పద్ధతులు సరిగా లేవని, ఇకపై తాము సరిచేస్తామని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. అందులో భాగాగంగానే ఈవో మారారు. ఆయన ఆధ్వర్యంలో హడావిడిగా తనిఖీలు జరిగాయి. 

Tags:    
Advertisement

Similar News