నడకదారిలో పిల్లల ఎంట్రీపై టీటీడీ ఆంక్షలు
అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీంతోపాటు భక్తుల రక్షణ కోసం వారికి రక్షణగా ముందు వెనుక రోప్‌ను, సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేయనుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు పిల్లలతో వెళ్తున్నారా..! నడక మార్గంలో కొండపైకి వెళ్లాలని ప్లాన్ చేసుకుంటున్నారా..! అయితే తాజాగా తిరుమల తిరుపతి దేవస్థానం తీసుకువచ్చిన ఆంక్షల గురించి మీరు తెలుసుకోవాల్సిందే. చిరుత దాడిలో చిన్నారి మృతి నేపథ్యంలో అలిపిరి నడక మార్గంలో పిల్లల అనుమతిపై ఆంక్షలు విధించింది టీటీడీ. అలిపిరి–తిరుమల మార్గంలో ఇకపై వంద మంది భక్తులను ఒక్కో బృందంగా దర్శనానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. దీంతోపాటు భక్తుల రక్షణ కోసం వారికి రక్షణగా ముందు వెనుక రోప్‌ను, సెక్యూరిటీ గార్డులను సైతం ఏర్పాటు చేయనుంది.
పిల్లలతో నడక మార్గంలో తిరుమలకు వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని సూచించారు టీటీడీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. మధ్యాహ్నం 2 గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు నడకదారిలో అనుమతి నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాదు సాయంత్రం 6 గంటల తర్వాత కొండపైకి ద్విచక్ర వాహనాల రాకపోకలను సైతం నిలిపివేస్తున్నట్లు తెలిపారు.
ఇక ఆదివారం శ్రీవారిని దర్శించుకునేందుకు పిల్లలతో వచ్చిన భక్తుల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది టీటీడీ. పిల్లలు తప్పిపోతే వారిని వెంటనే గుర్తించేందుకు వీలుగా వారి చేతికి ట్యాగ్‌లు వేశారు సిబ్బంది. ఈ ట్యాగ్‌పై చిన్నారి పేరు, తల్లిదండ్రుల వివరాలు, ఫోన్ నంబర్, పోలీసు టోల్ ఫ్రీ నంబర్ ఉంటాయి.