వాళ్లెవరో గుర్తించాం.. డ్రోన్ వీడియోపై వైవీ సుబ్బారెడ్డి వివరణ..

వీడియో తొలిసారిగా ప్రసారం అయిన యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల్ని పట్టుకున్నామని, విచారణ జరుగుతోందని చెప్పారాయన. ఆ వీడియో ఎప్పుడు తీశారు, కొత్తదా, పాతదా, లేక అసలది క్రియేట్ చేసిందా అనే విషయంపై నిపుణులు పరిశోధన చేస్తున్నారని చెప్పారు.

Advertisement
Update:2023-01-21 13:12 IST

తిరుమల శ్రీవారి ఆలయం వద్ద చిత్రీకరించిన డ్రోన్ వీడియో ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, జాతీయ స్థాయిలో మీడియా ఈ విషయాన్ని హైలెట్ చేస్తోంది. టీటీడీ నిఘా వ్యవస్థ విఫలమైందా, అసలు డ్రోన్ ఎగరేసినా ఎందుకు పసిగట్టలేకపోయారు, కొండపైకి మద్యం, మాంసం, సెగరెట్లు వెళ్లకుండా కింద పటిష్ట నిఘా ఉంటుంది. ప్రతి బ్యాగ్ ని, ప్రతి వాహనాన్ని చెక్ చేస్తారు. అలాంటిది డ్రోన్ కెమెరాని ఎలా తీసుకెళ్లారు, పోనీ విడిభాగాలుగా చేసినా స్కానింగ్ లో ఆ పరికరాలు కనపడాలి కదా.. అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో టీటీడీ కూడా ఈ వ్యవహారాన్ని కవర్ చేసుకోలేక తంటాలు పడుతోంది. కొంతసేపు ఆ వీడియో అసలు ఒరిజినల్ కాదంటారు, అది ఫేక్ అని అంటారు, మరికొంతసేపు అది ఇప్పటిది కాదు, పాత వీడియో అంటారు, అది అసలో నకిలీయో ఫోరెన్సిక్ ల్యాబ్ కి పంపించి తేల్చేస్తామంటారు. దీనిపై టీటీడీ ఈవో సహా, ఇంటెలిజెన్స్ అధికారులు ఇప్పటికే వివరణ ఇచ్చారు.

టీటీడీ చైర్మన్ వివరణ..

టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి కూడా తాజాగా డ్రోన్ వీడియోపై స్పందించారు. ఈ వీడియో తొలిసారిగా ప్రసారం అయిన యూట్యూబ్ ఛానెల్ నిర్వాహకుల్ని పట్టుకున్నామని, విచారణ జరుగుతోందని చెప్పారాయన. ఆ వీడియో ఎప్పుడు తీశారు, కొత్తదా, పాతదా, లేక అసలది క్రియేట్ చేసిందా అనే విషయంపై నిపుణులు పరిశోధన చేస్తున్నారని చెప్పారు.

టీటీడీ పై దుష్ప్రచారం..

టీటీడీపై దష్ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు వైవీ సుబ్బారెడ్డి. భక్తుల మనోభావాలు దెబ్బతీసేందుకే ఇలాంటి చర్యలు చేస్తున్నారని అన్నారు. మొట్ట మొదటగా ఆ వీడియో అప్ లోడ్ ఎరు చేశారో గుర్తించామని, వారిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పారు. మొత్తమ్మీద డ్రోన్ వీడియోతో ఒక్కసారిగా కలకలం రేగింది. ఆ వీడియో నిజమే అయితే కచ్చితంగా అది టీటీడీ నిఘా విభాగం వైఫల్యమేనని చెప్పాలి. ఇకనైనా కొండపైకి ఎవరెవరు వెళ్తున్నారు, ఎందుకు వెళ్తున్నారు, ఏమేం తీసుకెళ్తున్నారనే విషయంపై టీటీడీ సిబ్బంది మరింత నిఘా పెడితే మంచిదనే సలహాలు వినపడుతున్నాయి. తీరా వీడియోలు బయటకొచ్చాక భక్తుల మనోభావాలు దెబ్బతీస్తున్నారనడం కంటే, ముందుగానే జాగ్రత్త పడితే మేలు.

Tags:    
Advertisement

Similar News