అది నిజమైన బటన్, ఇది ఉత్తుత్తి బటన్.. జగన్ పై ట్రోలింగ్
‘ప్రధాని మోదీ సోమవారం నిజమైన బటన్ నొక్కి.. రాష్ట్రంలో 52 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి రూ. 1,100 కోట్లు జమ చేశారని, మంగళవారం సీఎం జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కడం ఎవరి కోసం? అని ప్రశ్నించారు.
రైతు భరోసా నిధులను బటన్ నొక్కి విడుదల చేశామని చెప్పారు సీఎం జగన్. తెనాలిలో జరిగిన బహిరంగ సభలో ఆయన ల్యాప్ టాప్ పై బటన్ నొక్కి నిధులు విడుదల చేశారు. అయితే అవి అంతకు ముందురోజే రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. వాస్తవానికి రైతు భరోసా అనేది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలసి అమలు చేస్తున్న పథకం. ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో కేంద్రం పీఎం-కిసాన్ అమలు చేస్తోంది. ప్రతి రైతుకి ఏడాదికి 6వేల రూపాయలు నేరుగా వారి అకౌంట్లలోకే జమ చేస్తోంది. మూడు విడతల్లో ఈ ఆరువేలు జమ అవుతాయి. ఇక రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రైతుకి 7500 రూపాయలు అందజేస్తుంది. ఇది రెండు విడతల్లో జమ అవుతుంది. అయితే నిన్న జగన్ నొక్కిన బటన్ కేంద్రం విడుదల చేసిన సొమ్ముకి సంబంధించినది అంటున్నారు ఏపీ బీజేపీ, టీడీపీ నేతలు. జగన్ పై ట్రోలింగ్ మొదలు పెట్టారు.
‘అయిపోయిన పెళ్లికి మేళాలెందుకు? చేయని పెళ్లికి శుభలేఖ లెందుకు’ అంటూ బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ ట్వీట్ చేశారు. ‘ప్రధాని మోదీ సోమవారం నిజమైన బటన్ నొక్కి.. రాష్ట్రంలో 52 లక్షల మంది అన్నదాతల ఖాతాల్లోకి రూ. 1,100 కోట్లు జమ చేశారని, మంగళవారం సీఎం జగన్ ఉత్తుత్తి బటన్ నొక్కడం ఎవరి కోసం? అని ప్రశ్నించారు. కోట్ల రూపాయల ప్రజాధనంతో ప్రకటనలు ఎవరి లబ్ధి కోసం? అని అడిగారు. ఎవరిని మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు.
అటు టీడీపీ కూడా ఈ వ్యవహారంపై ట్రోలింగ్ మొదలు పెట్టింది. డబ్బులు నిన్ననే పడ్డాయి కదా, మళ్లీ ఈరోజు బటన్ నొక్కడం దేనికి అంటూ టీడీపీ ట్వీట్లు వేస్తోంది. కేంద్రం ఇచ్చే ఆర్థిక సాయం నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయిన తర్వాత మరోసారి జగన్ తానేదో బటన్ నొక్కినట్టు భ్రమలు కల్పిస్తున్నారని, రైతుల్ని జగన్ దారుణంగా మోసం చేస్తున్నారని టీడీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.