మర్యాద, మన్నన.. పద్ధతి, గౌరవం

తొలి వంద రోజులు.. పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాతే వారు సభలో చేసే చర్చలు బలంగా ఉంటాయని ఎమ్మెల్యేలకు సూచించారు పవన్.

Advertisement
Update:2024-06-25 22:31 IST

ఇటీవల జనసేన నేతలు కొందరు అసెంబ్లీ బయట, అసెంబ్లీ ప్రాంగణంలో రీల్స్ చేస్తున్నట్టుగా కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జనసేన నేతలు సభ మర్యాదను పాడు చేస్తున్నారనే విమర్శలు కూడా వినపడ్డాయి. ఈ నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశా నిర్దేశం చేశారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలను సభలో ప్రతిఫలింపజేసేందుకు ప్రయత్నిద్దామని పిలుపునిచ్చారు.


సభా వ్యవహారాలు, నియమావళి, సంప్రదాయాలపై జనసేన ఎమ్మెల్యేలకు విజయవాడలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పవన్ కల్యాణ్ వారికి దిశా నిర్దేశం చేశారు. పార్టీ నుంచి గెలిచిన వారిలో ఎక్కువ మంది శాసనసభ వ్యవహారాలకు కొత్తవారేనని.. అందరూ సభా నియమావళి, సంప్రదాయాలపై అవగాహన తెచ్చుకోవాలని సూచించారు. సభలో హుందాగా ఉండాలని, ప్రజల మన్ననలు పొందాలన్నారు. తొలి వంద రోజులు.. పాలనాపరమైన విషయాలపై అవగాహన, అధ్యయనంపై దృష్టి పెట్టాలని, ఆ తర్వాతే వారు సభలో చేసే చర్చలు బలంగా ఉంటాయని చెప్పారు పవన్.

భావ తీవ్రత ఉన్నా భాష సరళంగా ఉండాలన్నారు పవన్ కల్యాణ్. అధికారులు, ప్రభుత్వ ఉద్యోగులతో మాట్లాడేటప్పుడు, మీడియా చర్చల్లో పరుష పదజాలం వాడొద్దని ఎమ్మెల్యేలకు సూచించారు. ప్రజలతో గౌరవంగా ఉంటూ వారు తమ బాధలు, సమస్యలు చెప్పేటప్పుడు జాగ్రత్తగా వినాలన్నారు. ఇక జనవాణి కార్యక్రమాన్ని కూడా జనసేన ఎమ్మెల్యేలు కొనసాగించాలని, నెలకోసారి వారి నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం ప్రజల మధ్య, ప్రజలతోనే ఉండాలని వారికి సూచించారు పవన్ కల్యాణ్. నియోజకవర్గాల వారిగా అభినందన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని, జనసేన నేతల గెలుపుకోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ ఆభినందించాలని, వారికి గుర్తింపునివ్వాలని చెప్పారు. పార్టీని బలోపేతం చేయడంపై కూడా దృష్టి పెట్టాలన్నారు జనసేనాని. 

Tags:    
Advertisement

Similar News