ఎన్నికల ముందు మద్య నిషేధం.. జగన్ అంత సాహసం చేయగలరా..?

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. సంపూర్ణ మద్య నిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఎన్నికల ముందు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారాయన.

Advertisement
Update:2022-12-25 22:03 IST

ఎన్నికల ముందు మద్య నిషేధం.. జగన్ అంత సాహసం చేయగలరా..?

ఎన్నికల వేళ ఇచ్చిన హామీల్లో నూటికి నూరుశాతం అమలు చేశామని వైసీపీ ఎప్పుడూ చెప్పలేదు. 95 శాతం అమలు చేశామంటుంది. ఆ మిగిలిన శాతంలో సీపీఎస్ రద్దు కూడా ఉంది, అందులోనే సంపూర్ణ మద్య నిషేధం కూడా ఉంది. పాదయాత్రలో అక్కచెల్లెమ్మల కష్టాలు విన్న జగన్, పల్లెటూళ్లలో సగం మంది కష్టాలకు కారణం మద్యమేనని తీర్మానించారు.

మందు తాగి ఇల్లు, ఒళ్లు గుల్ల చేసుకుంటున్నవారిని దారిలో పెట్టాలంటే వారికి అది దొరక్కుండా చేయాలి, అంటే మద్యాన్ని నిషేధించాలి. కానీ జగన్ అధికారంలోకి వచ్చాక జరిగింది మాత్రం వేరు.

ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోని మద్యం షాపుల్ని ప్రభుత్వమే నిర్వహిస్తోంది. వైన్ షాపులు, బార్లు, రెస్టారెంట్లకు తోడు.. సూపర్ మార్కెట్ల లాంటి ఎలైట్ వైన్ షాపుల్ని కూడా తీసుకొచ్చి మద్యం అమ్మకాల్ని మరింత ప్రోత్సహించింది ప్రభుత్వం. లిక్కర్ రేట్లు పెంచేసి ఆదాయం కూడా పెంచుకుంది.

ఇలాంటి దశలో మద్య నిషేధం అంటే అది సాహసమేనని చెప్పాలి. అమ్మ ఒడి - నాన్న బుడ్డి అంటూ టీడీపీ సెటైర్లు వేస్తున్నా కామ్ గానే ఉన్నారు వైసీపీ నేతలు. సంక్షేమ పథకాలకు ఇస్తున్న డబ్బుల్ని మరో చేత్తో మద్యం రూపంలో ప్రభుత్వం తీసుకుంటుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.

అయితే ఇప్పుడు డిప్యూటీ స్పీకర్ కోలగట్ల వీరభద్రస్వామి చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో కలకలం సృష్టించాయి. సంపూర్ణ మద్యనిషేధం దిశగా ఏపీ ప్రభుత్వం ఆలోచిస్తోందని, ఎన్నికల ముందు దీనిపై నిర్ణయం తీసుకునే అవకాశముందని చెప్పారాయన.

సీపీఎస్ రద్దుపై కూడా ప్రభుత్వం ఎన్నికల ముందు నిర్ణయం తీసుకుంటుందనే అంచనాలున్నాయి. అదే సమయంలో సంపూర్ణ మద్యనిషేధంపై కూడా ప్రజలకు జవాబు చెప్పాల్సిన బాధ్యత జగన్ పై ఉంది. అన్ని హామీలు అమలు చేశాం, ఆ హామీల అమలు కోసమే మద్యనిషేధం చేయలేదు అని చెబితే అది మడమ తిప్పినట్టే అవుతుంది.

మద్యం ద్వారా వచ్చే ఆదాయం లేకపోయినా సంక్షేమ పథకాలు అమలు చేస్తేనే గొప్ప. మరి ఆ దిశగా జగన్ నిర్ణయం తీసుకుంటారో లేదో చూడాలి. ఒకవేళ మద్య నిషేధం అమలు చేస్తే మాత్రం అది పెద్ద సాహసమనే చెప్పాలి.

మద్య నిషేధం విషయంలో ప్రభుత్వ పెద్దల మధ్య చర్చ జరగకపోతే డిప్యూటీ స్పీకర్ కోలగట్ల ఈ వ్యాఖ్యలు చేసేవారు కాదు. మద్య నిషేధం విషయంలో అన్నీ పరిశీలించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని అన్నారాయన. ఆ నిర్ణయం తీసుకుంటే 100 షాపులు ఉన్నా, 10 షాపులు ఉన్నా మూతపడక తప్పదని తేల్చి చెప్పారు. కరోనా వల్ల, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దెబ్బతినడం వల్ల మద్య నిషేధం అమలు వాయిదా పడిందని, లేకపోతే ఈపాటికే దాన్ని అమలు చేసి ఉండేవారమని చెప్పారు. మొత్తమ్మీద ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఏపీలో మద్య నిషేధం హామీ మరోసారి హాట్ టాపిక్ గా మారే అవకాశముంది.

Tags:    
Advertisement

Similar News