బీజేపీ పోటీ చేసే 10 స్థానాల లిస్ట్ ఇదే
విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు పేరు దాదాపు ఖరారైంది. అయితే ఇక్కడ ఇంకో బలమైన అభ్యర్థి ఉన్నారని చర్చ జరుగుతోంది.
టీడీపీ, జనసేనతో పొత్తు కలిసిన బీజేపీ రాష్ట్రంలో 10 అసెంబ్లీ సీట్లలో పోటీ చేయబోతోంది. పార్టీ పోటీ చేసే పది అసెంబ్లీ స్థానాలను దాదాపు ఖరారు చేశారు. స్థానాలు ఖరారవడంతో వాటిలో అభ్యర్థుల ఎంపికపై పార్టీ దృష్టి సారించింది. సోము వీర్రాజు, విష్ణుకుమార్ రాజు లాంటి సీనియర్ నేతలతో సహా పలువురు పోటీపడుతున్నారు.
ఇవీ ఆ 10 స్థానాలు
విశాఖ నార్త్, శ్రీకాకుళం, పాడేరు, అనపర్తి, కైకలూరు, విజయవాడ వెస్ట్, బద్వేలు, జమ్మలమడుగు, ధర్మవరం, ఆదోని నియోజకవర్గాల నుంచి బీజేపీ పోటీ చేస్తుంది. లాస్ట్ మినిట్ చేంజెస్‌లో ఏదైనా ఒకటి, రెండు స్థానాలు మారవచ్చు.
వీర్రాజు, విష్ణుకుమార్ రాజు
విశాఖ నార్త్ నుంచి సీనియర్ నేత విష్ణుకుమార్ రాజు పేరు దాదాపు ఖరారైంది. అయితే ఇక్కడ ఇంకో బలమైన అభ్యర్థి ఉన్నారని చర్చ జరుగుతోంది. కైకలూరు నుంచి పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, రాష్ట్ర మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు పోటీ చేయడానికి రంగం సిద్ధమైంది. ఈ రెండు సీట్లనూ 2014లో ఇదే పొత్తులో బీజేపీ గెలుచుకుంది. అయితే విష్ణుకుమార్‌రాజుకు మళ్లీ సీటు దక్కగా కైకలూరులో 2014లో గెలిచి, మంత్రి కూడా అయిన కామినేని శ్రీనివాస్‌ను పక్కనపెట్టి వీర్రాజుకు అవకాశం ఇవ్వనున్నారు.
ఆదినారాయణరెడ్డి, వరదాపురం సూరికి ఖాయం
జమ్మలమడుగులో మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి, బద్వేలు నుంచి సురేష్, ధర్మవరం నుంచి మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి, ఆదోని నుంచి కర్నూలు జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొనిగిరి నీలకంఠం, శ్రీకాకుళం నుంచి పార్టీ రాష్ట్ర కార్యదర్శి కె.సురేంద్రమోహన్ పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇందులో వరదాపురం సూరి పొత్తు కుదరకపోతే టీడీపీ నుంచే టికెట్ తెచ్చుకోవడం కోసం రాప్తాడు సభలో చంద్రబాబుకు మద్దతుగా తన వర్గీయులతో ఫ్లెక్సీలు కట్టించడం, దానిమీద పరిటాల శ్రీరామ్‌తో గొడవపడడం జరిగింది. ఈనేపథ్యంలో ధర్మవరంలో వేరే పేరు లేకుండా నేరుగా వరదాపురం సూరినే ఎంపిక చేయబోతున్నారు. జమ్మలమడుగులోనూ సీనియర్ నేత ఆదినారాయణరెడ్డికి టికెట్ గ్యారంటీ.