ఎవ్వరితోనూ పొత్తులుండవు...క్లారిటీ ఇచ్చిన జగన్ !
మదనపల్లె లో విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేసిన సందర్భంలో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగించారు. తనకు ప్రజలతో తప్ప మరెవరితోనూ సంబంధం లేదని, ప్రజలతో తప్ప మరెవరితోనూ పొత్తులుండవని చెప్పారాయన.
ఆంధ్రప్రదేశ్ లో ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ప్రచారం నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పొత్తులపై క్లారిటీ ఇచ్చారు. తమ పార్టీ రాబోయే ఎన్నికల్లో ఒంటరిగానే వెళ్తుందని ప్రకటించారు.
మదనపల్లె లో విద్యా దీవెన పథకం కింద నిధులు విడుదల చేసిన సందర్భంలో ఆయన ప్రసంగించారు. "నాకు ప్రజలతో తప్ప మరెవరితోనూ సంబంధం లేదు. మీ బిడ్డ నిజాయితీని నమ్ముకున్నాడు. ఇచ్చిన మాటను చేసి చూపిస్తున్నాడు. మీకు నమ్మకం ఉంటే మీ బిడ్డను ఆశీర్వదించండి. నేను ఎవరినైనా నమ్ముతున్నాను అంటే దేవుణ్ణి ఆ తర్వాత ప్రజలనే . నాకు ఎవరితోనూ పొత్తులు ఉండవు. ప్రజలతోనే నా పొత్తు " అని స్పష్టంగా చెప్పారు. పనిలో పనిగా విపక్షాలపై దుష్ట చతుష్టయం అంటూ అంటూ విమర్శలు గుప్పించారు.
విపక్షాల్లో గందరగోళం
రాష్ట్రంలో మారుతున్న రాజకీయ పరిణామాల మధ్య ఏ పార్టీ మరే పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, ఎవరెవరు కలిసి ఎన్నికల్లో పోటీ చేస్తారో గందరగోళంగానే ఉంది. ప్రధానంగా తెలుగుదేశం పార్టీ,జనసేన, బిజెపి,వామ పక్షాలు రాష్ట్రంలో పనిచేస్తున్నాయి. టిడిపి, జనసేన ల మద్య పొత్తు ఉంటుందనే వాదనొక సమయంలో బలంగా వినిపించింది. ప్రధాని మోడీతో విశాఖలో జనసేన అధినేత పవన్ కలిసిన తర్వాత ఆయన వైఖరిలో మార్పు కనిపించింది. టిడిపితో పొత్తు ప్రస్తావన ఎక్కడా వినబడడంలేదు. ఆయన కూడా ఒంటరిగా బరిలోకి రావాలనే ఉబలాటపడుతున్నాడు. అయితే జనసేన మాకు బంధువే..మిత్రపక్షమేనంటూ బిజెపి సన్నాయి నొక్కులు నొక్కుతూ పవన్ ను బెసగకుండా చేస్తూ వాడుకోవాలనుకుంటున్నదని పవన్ అభిమానులు అనుమానిస్తున్నారు. మొత్తం మీద జనసేనాని బిజెపిని కాదని ముందుకు వెళ్ళగలడా అనేది ప్రశ్న. ఆయన పూర్తిగా తెలుగుదేశం పార్టీ బలాన్ని నమ్మలేకపోతున్నాడని అంటున్నారు. రేపు ఎన్నికల్లో ఫలితాలు తారుమారైతే అనుకున్నది ఫలించకపోతే జనసేన భవిష్యత్తు ఏంటనే ఆలోచనలో పవన్ పరివారం ఉంది.
అందువల్ల తెగించి బిజెపిని కాదనలేకపోవచ్చంటున్నారు. తాను కూడా అందుకనే ఎన్నికల వరకూ పొత్తుల ప్రస్తావన తీసుకురాకూడదనుకుంటున్నారట. కానీ తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ఎవరితోనైనా జత కట్టేందుకు సిద్దంగా ఉంది. జనసేన పొత్తులకు ఎప్పుడు ముందుకు వస్తుందా అన్నట్టు ఎదురుచూస్తోంది. ఇక వామపక్షాలు ఎన్నికల నాటికి ఏదో ఒక పార్టీ తో జత కట్టాల్సిందే.