అమరావతి విషయంలో హైకోర్టు తన పరిధిని దాటిందంటూ తప్పుబట్టిన సుప్రీం కోర్టు

అమ‌రావ‌తి నిర్మాణాల‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలంటూ ఇచ్చిన హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను సుప్రీం కోర్టు త‌ప్పుబ‌ట్టింది. ఆరు నెల‌ల్లోనే నిర్మాణాలంటే ఎలా సాధ్యం? నిర్మాణాలు చేప‌ట్టాలా లేక అక్క‌డ బొమ్మ‌లు గీయాలా అంటూ ప్ర‌శ్నించింది.

Advertisement
Update:2022-11-28 15:10 IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాజ‌ధాని అమ‌రావ‌తి విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వానికి తాత్కాలికంగా వెసులుబాటు లభించింది. అమ‌రావ‌తి నిర్మాణాల విష‌యంలో గ‌తంలో హైకోర్టు ఇచ్చిన కాల‌ప‌రిమితి ఉత్త‌ర్వుల పై సోమ‌వారంనాడు సుప్రీంకోర్టు స్టే విధించింది. అలాగే రైతుల నుంచి భూసేక‌ర‌ణ స‌మ‌యంలో ఇచ్చిన హామీల‌ను ప్ర‌భుత్వం సాధ్య‌మైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని కూడా సుప్రీం కోర్టు ఆదేశించింది. ఈ విష‌యాల‌పై మ‌రింత కూలంక‌షంగా విచార‌ణ జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉందంటూ త‌దుప‌రి విచార‌ణ‌ను జ‌న‌వ‌రి 31వ తేదీకి వాయిదావేసింది. ఈ లోగా ఇప్ప‌టివ‌ర‌కూ జ‌రిగిన ప‌రిణామాల‌ను పూర్తిగా నివేదించాలంటూ ప్ర‌తివాదుల‌కు నోటీసులిచ్చింది.

ఆరు నెల‌ల్లో అమ‌రావ‌తి నిర్మాణాలు పూర్తి చేయాల‌ని మార్చినెల‌లో హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. అలాగే మూడు రాజ‌ధానుల విష‌య‌మై కూడా హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను సుప్రీం ధ‌ర్మాస‌నం త‌ప్పుబ‌ట్టింది. హైకోర్టు ఆదేశాల‌ను ప్ర‌భుత్వం సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది. అమ‌రావ‌తి రైతులు కూడా సుప్రీంకోర్టును ఆశ్ర‌యించారు. నేడు ఈ పిటిష‌న్ల‌ను విచారించిన సుప్రీం ద‌ర్మాస‌నం ప‌లు కీల‌క వ్యాఖ్య‌లు చేసింది.

ముఖ్యంగా అమ‌రావ‌తి నిర్మాణాల‌ను ఆరు నెలల్లో పూర్తి చేయాలంటూ ఇచ్చిన హైకోర్టు ఉత్త‌ర్వుల‌ను త‌ప్పుబ‌ట్టింది. ఆరు నెల‌ల్లోనే నిర్మాణాలంటే ఎలా సాధ్యం? నిర్మాణాలు చేప‌ట్టాలా లేక అక్క‌డ బొమ్మ‌లు గీయాలా అంటూ ప్ర‌శ్నించింది. నైపుణ్యం లేకుండా ఇలాంటి ఉత్త‌ర్వులు ఎలా ఇస్తార‌ని హైకోర్టును నిల‌దీసింది. మీరైమైనా టౌన్ ప్లాన‌రా..అని ప్ర‌శ్నించింది.

అలాగే రాజ‌ధాని ఎక్క‌డ ఉండాల‌న్న విష‌యం నిర్ణ‌యించేది ప్ర‌భుత్వం క‌దా..కోర్టులు ప్ర‌భుత్వంలా వ్య‌వ‌హ‌రిస్తే ఇక ప్ర‌భుత్వాలు ఎందుకు..కేబినెట్ ఎందుకు..అని నిల‌దీసింది. అభివృద్ధి ఒకే చోట కేంద్రీకృత‌మైతే ఎలా..ఏయే న‌గ‌రాల‌ను అభివృద్ధి చేయాలో అది ప్ర‌భుత్వం నిర్ణ‌యించుకుంటుంది. కోర్టుల జోక్యం ఎందుకు అంటూ, ఈ విష‌యంలో రాష్ట్ర హైకోర్టు త‌న ప‌రిధిని దాటింద‌ని ఘాటు వ్యాఖ్య‌లు చేసింది.

Tags:    
Advertisement

Similar News