జగన్‌తో వైరం కాంగ్రెస్‌కు తీరని నష్టం

ఇటీవలి కాలంలో పిసిసి అధ్యక్షురాలిగా వై.ఎస్‌.షర్మిలను నియమించడమన్నది కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మక తప్పిదం. రాజకీయ చతురత లోపించిన ఫలితం.

Advertisement
Update:2024-04-02 16:26 IST
జగన్‌తో వైరం కాంగ్రెస్‌కు తీరని నష్టం
  • whatsapp icon

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది వాస్తవం. అలాగే ఆత్మహత్యలే తప్ప హత్యలకు ఆస్కారం లేదు. అందుకే కక్ష సాధింపు రాజకీయాలు ఏ పార్గీ పురోగతికి తోడ్పడవు. ఈ చిన్నపాటి తర్కం కూడా తెలియని దుస్థితిలో జాతీయ కాంగ్రెస్‌ పార్టీ అధినాయకత్వం ఉంది. అందుకే తప్పుల మీద తప్పులు చేస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. కడప ఎం.పి. స్థానం నుంచి పోటీకి ఆంధ్రప్రదేశ్ చీఫ్ వై.ఎస్‌. షర్మిలను ఎంపిక చేయడం ద్వారా కాంగ్రెస్‌ అధిష్టానం మరో తప్పు చేసింది. మొదట ఆమెని పిసిసి అధ్యక్షురాలిగా నియమించడమే పెద్ద తప్పిదం. ఇపుడు మరో అతి పెద్ద తప్పిదం కడప బరిలో ఆమెను కాంగ్రెస్‌ అభ్యర్థిగా నిలబెట్టడం. ఈ పరిణామం ఏఐసిసికి దార్శనికత, దీర్ఘకాలిక దృష్టి లేదని తేటతెల్లం చేస్తున్నది. ఈ దృష్టిలోపం మొత్తం దేశ రాజకీయాల్లో కాంగ్రెస్‌నే బలహీనపరుస్తుండగా, తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో కాంగ్రెస్‌ అధిష్టానం నిర్ణయాలు ఆ పార్టీకి ఏమాత్రం వివేచన, దూరదృష్టి లేవని చెప్పకనే చెబుతున్నాయి.

తెలంగాణ పిసిసి అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డిని నియమించినపుడే రాజకీయ పరిశీలకులు విస్తుపోయారు. సరే, ఏమైనా అక్కడ ఆయన గెలుపుగుర్రంగా ఉన్నారు కాబట్టి, ఆ నిర్ణయాన్ని గురించి ఇపుడే ఏమీ వ్యాఖ్యానించలేము. కానీ ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాలకు సంబంధించి వస్తే రాష్ట్రంలో కాంగ్రెస్‌ ఉనికి శూన్యం. 2014 తరువాత ఏపిలో కాంగ్రెస్‌ నామమాత్రంగా మిగిలిపోయింది. కొన్నాళ్ళ కిందట గిడుగు రుద్రరాజును పిసిసి అధ్యక్షునిగా నియమించారు. సరే, తన ఉనికి కోసం ప్రతి పార్టీ ఏదో రకంగా ప్రయత్నిస్తుంది కాబట్టి, ఆ నియామకాన్ని పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు.

కానీ ఇటీవలి కాలంలో పిసిసి అధ్యక్షురాలిగా వై.ఎస్‌.షర్మిలను నియమించడమన్నది కాంగ్రెస్‌ పార్టీ వ్యూహాత్మక తప్పిదం. రాజకీయ చతురత లోపించిన ఫలితం. వై.ఎస్‌. జగన్‌కు వ్యతిరేకంగా ఆయన చెల్లెలు షర్మిలను నిలబెట్టడం సముచితం కాదు. తన తెలివైన నిర్ణయాల ద్వారా తెలుగునాట కాంగ్రెస్‌ను బలోపేతం చేసిన వై.ఎస్‌. రాజశేఖర్‌ రెడ్డి కుటుంబంలో తగాదాలు పెట్టడాన్ని వై.ఎస్‌. అభిమానులే కాదు ప్రజలు కూడా సహించరు. ఇది తప్పుడు సంకేతాలను ఇస్తున్నది. కేవలం వై.ఎస్‌.జగన్మోహన్‌రెడ్డి సొంతంగా పార్టీ పెట్టి గెలిచి నిలబడటం జీర్ణం చేసుకోలేకనే ఆయన మీద కక్షతో కాంగ్రెస్‌ అధిష్టానం షర్మిలను ప్రోత్సహిస్తున్నదని ప్రజలు భావిస్తున్నారు.

ఎందుకంటే వై.ఎస్‌. షర్మిల రెగ్యులర్‌గా రాజకీయాల్లో లేరు. కేవలం అన్నకు అండగా నిలబడి కొంతకాలం పనిచేశారు. వారిద్దరి మధ్య ఏవో కారణాల వల్ల అభిప్రాయభేదాలు, అసంతృప్తులు తలెత్తాయి. అది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. ఆమె తెలంగాణకు వచ్చి కొన్నాళ్ళ పాటు హడావిడి చేసి తిరిగి కాంగ్రెస్‌లో చేరిపోయారు. అంతకాలం తెలంగాణలో కెసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన షర్మిలకు తెలంగాణ కాంగ్రెస్‌ ఎలాంటి లబ్ది చేకూర్చలేదు. కానీ ఆమె అసంతృప్తికి ఆజ్యం పోసి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల వైపు ఆమె ప్రయాణాన్ని మలుపు తిప్పారు. జగన్‌కు వ్యతిరేకంగా నిలబెట్టారు.

ఈ పరిణామం సొంత చెల్లెలే జగన్‌ను నమ్మడం లేదని చంద్రబాబు, పవన్‌లు ఎత్తిపొడవటానికి మాత్రమే ఉపయోగపడింది. అంతే తప్ప షర్మిల వల్ల ఏపిలో కాంగ్రెస్‌కు ఒరిగేదేం లేదు. నిజానికి కాంగ్రెస్‌ పట్ల జనాల్లో ఉన్న అసంతృప్తి మరింత రెట్టింపయింది. ఇపుడు ఏకంగా కడప బరిలో షర్మిలను నిలబెట్టడం కాంగ్రెస్‌ వివేచనా రాహిత్యాన్ని సూచిస్తున్నది.

ఎందుకంటే జగన్‌ కాంగ్రెస్‌ అధిష్టానాన్ని వ్యతిరేకించి సొంతంగా పార్టీ పెట్టారే తప్ప కాంగ్రెస్‌ సైద్ధాంతికత నుంచి వైదొలగలేదు. తనదైన ఎజెండాతో, తనదైన పద్ధతిలో రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగారు. జనాల మధ్య నిలబడి తన స్థానాన్ని పదిలపరుచుకున్నారు. కనుకనే 2019 నాటి అసెంబ్లీ ఎన్నికల్లో బ్రహ్మండమైన విజయం సాధించారు. ఇపుడు మరోసారి గెలుపు పథంలో ఉన్నారు. మున్ముందు జగన్‌ను, జగన్‌ పార్టీని ఎదుర్కోగల సత్తా తెలుగుదేశం పార్టీకి లేదు.

నిజానికి 2024 ఎన్నికలు చంద్రబాబుకు, టిడిపికి చివరి ఎన్నికలు. జనసేన పవన్‌, బిజెపిలపై జనాలకు ఎలాంటి నమ్మకాలు లేవు. కనుక ఇపుడే కాదు, మూడోసారి కూడా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో జగన్‌ మాత్రమే కీలక నేత. దరిదాపుల్లో ఆయనకు దీటుగా నిలబడే పార్టీ కానీ, నేత కానీ ఆవిర్భవించే పరిస్థితి లేదన్నది వాస్తవం.

ఇలాంటపుడు జగన్‌తో వైరం కాంగ్రెస్‌ నాయకత్వానికి ఏమాత్రం మేలు చేకూర్చదు. సూత్రరీత్యా కూడా జగన్‌ మాత్రమే దీర్ఘకాలంలో కాంగ్రెస్‌కు మిత్రుడు అవుతాడు. పార్టీ పెట్టినప్పట్నించి ఇప్పటివరకు ఆయన బిజెపిని, ఎన్‌డిఏను దగ్గరకు రానివ్వలేదు. అంశాల వారీగా మాత్రమే పార్లమెంటులో ఎన్‌డిఏకు మద్దతు పలికారే తప్ప వారు చెప్పిందే వేదం అన్నట్టుగా వ్యవహరించలేదు.

ఇపుడు కాకున్నా రాబోయే అయిదు, పదేళ్ళ కాలంలో కాంగ్రెస్‌ కోలుకొని కేంద్రంలో అధికారం చేపట్టే సానుకూల పరిస్థితులు ఏర్పడితే జగన్‌ మద్దతు తప్పనిసరి. అందుకని రాజకీయంగా జగన్‌ను ఇరకాటంలో పెట్టే ప్రస్తుత నిర్ణయాలు కాంగ్రెస్‌ అధిష్టానానికి తగవు. కానీ ఈ ఆలోచన, వివేచన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ, ఏఐసిసి పెద్దలకు లేకపోవడం వైచిత్రి. కేవలం జగన్‌ మీద వ్యక్తిగత కక్షతో నిర్ణయాలు తీసుకోవడం అఖిల భారత స్థాయిలో పార్టీ నడిపే వారికి సముచితం కాదు.

రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, మిత్రులు ఉండరన్నది జగమెరిగిన సత్యం. నిజానికి జగన్‌కు, కాంగ్రెస్‌కు మధ్య ఉన్నది మిత్ర వైరుధ్యమే. ఎందుకంటే వై.ఎస్‌. రాజశేఖరరెడ్డి మాదిరిగానే ఆయన బిజెపిని, తెలుగుదేశం పార్టీని ఎదిరించి పోరాడుతున్నారు. తన రాజకీయ వ్యవహారసరళి లౌకికవాదం పునాదుల మీదనే కొనసాగుతున్నది. అందుకని జగన్‌ను ఇరకాటంలో పెట్టే నిర్ణయాలు దీర్ఘకాలికంగా కాంగ్రెస్‌ ప్రయోజనాలకు అడ్డంకిగా పరిణమిస్తాయి. జగన్‌ లాంటి యువనాయకుల అండ లేకుండా రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రిని చేయడం గానీ, కేంద్రంలో అధికారంలోకి రావడం గానీ కాంగ్రెస్‌కు ఎలా సాధ్యం? ఈ చిన్నపాటి అవగాహన లేని రాజకీయ అపరిపక్వత కారణంగా కాంగ్రెస్‌ పార్టీది ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా పరిణమించింది.

Tags:    
Advertisement

Similar News