ఈవీఎంలపై అనుమానాలను బలపరుస్తున్న ఎన్నికల అధికారుల తీరు
ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు.
ఆంధ్రప్రదేశ్‌లో ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వినియోగించిన ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల (ఈవీఎంలు) పనితీరుపై ఏడీఆర్ (అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫారమ్స్), వీఎఫ్ (ఓట్ ఫర్ డెమొక్రసీ) పలు అనుమానాలు వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఎన్నికల అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఆ అనుమానాలే నిజమా అనే సందేహాలు కలగకమానవు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ ఎన్నికల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల సంఘం తొలుత వెల్లడించిన పోలింగ్ శాతానికి, తర్వాత ప్రకటించిన దానికి భారీ వ్యత్యాసం ఉండటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌లో అత్యధికంగా 12.54 శాతం పోలింగ్ పెరగడంపై ఆ రెండు సంస్థలతో పాటు పలు రాజకీయ పార్టీల నేతలు, సామాజికవేత్తలు సందేహాలు వ్యక్తం చేశారు. పలువురు వైసీపీ అభ్యర్థులు వీటి పనితీరుపై ఫిర్యాదులు కూడా చేయడం తెలిసిందే.
విజయనగరం లోక్‌సభను ఉదాహరణగా తీసుకుంటే.. మే 13న పోలింగ్ జరగగా, 21 రోజుల తర్వాత జూన్ 4న ఓట్ల లెక్కింపు నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవీఎంలను పరిశీలించగా, అధిక శాతం ఈవీఎంలలో ఛార్జింగ్ 99 శాతం ఉన్నట్టు వైసీపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గమనించి, అనుమానం వ్యక్తం చేశారు. దీనిపై విచారణ జరపాలని రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. విచారణ కోసం జూన్ 10న ఆయన రూ.94,400 ఫీజు కూడా చెల్లించారు. అలాగే ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా మొత్తం 12 ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేస్తూ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు సమర్పించారు. దీనిపై విచారణకు రూ.5,66,400 ఫీజుగా జూన్ 10న చెల్లించారు. బొబ్బిలి శాసనసభ స్థానం వైసీపీ అభ్యర్థి శంబంగి చిన అప్పలనాయుడు కూడా ఇదే రీతిలో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదులన్నింటిపైనా ఈ నెల 25 నుంచి 28 వరకు ఈవీఎంలు తయారు చేసిన కంపెనీ ప్రతినిధులు, ఎన్నికల కమిషన్ ఉన్నతాధికారుల సమక్షంలో విచారణ జరగనుంది.
ఆంధ్రరాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియపై ఇప్పటికే దేశవ్యాప్తంగా సందేహాలు రేకెత్తుతుండగా తాజాగా ఎన్నికల సంఘం అధికారులు వ్యవహరిస్తున్న తీరు మరింత అనుమానాలకు తావిస్తోంది. ఈవీఎంల ట్యాంపరింగ్‌పై వైసీపీ అభ్యర్థుల ఫిర్యాదులను విచారించేందుకు స్వయం ప్రతిపత్తి కలిగిన ఎన్నికల సంఘం వెనకడుగు వేస్తుండటం విస్మయం కలిగిస్తోంది. విచారణ తేదీ దగ్గర పడుతున్న కొద్దీ అధికారుల్లో ఆందోళన పెరుగుతోంది. ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలంటూ వైసీపీ అభ్యర్థులపై అధికారులు పెద్ద ఎత్తున ఒత్తిడి తెస్తున్నారు. ఫిర్యాదులు వెనక్కి తీసుకుంటే మీరు చెల్లించిన ఫీజు వెనక్కి ఇచ్చేస్తామని ప్రతిపాదిస్తున్నారు. ఈ విషయాన్ని ఫిర్యాదు చేసిన వైసీపీ విజయనగరం ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ స్వయంగా వెల్లడించారు. ఫిర్యాదు వెనక్కి తీసుకోవాలని అధికారులు తనను కోరారని, ఫీజును వాపసు ఇస్తామని చెప్పారని ఆయన తెలిపారు. అయితే విచారణ నిర్వహించాల్సిందేనని తాను తేల్చి చెప్పానని ఆయన చెప్పారు.
మరోపక్క ఒంగోలు ఎమ్మెల్యే అభ్యర్థి బాలినేని పీఏకి కూడా ఇదే విధంగా అధికారులు ఫోన్ చేసి ఫిర్యాదు వాపసు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారని స్వయంగా బాలినేని శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. విచారణ జరగాల్సిందేనని, వాస్తవాలు నిగ్గుతేలాల్సిందేనని తాను చెప్పినట్టు ఆయన వివరించారు. ఈవీఎంలపై ఫిర్యాదుల విషయంలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఈవీఎంల పనితీరుపై ఏడీఆర్, వీఎపీలతో పాటు వైసీపీ అభ్యర్థులు, వివిధ రాజకీయపార్టీల నేతలు, సామాజికవేత్తలు వ్యక్తం చేసిన అనుమానాలు నిజమేననే అభిప్రాయం బలంగా కలుగుతోంది. విచారణలో ఏం తేలుతుందనేది వేచిచూడాలి.