ఉత్తరాంధ్రలో కాదు.. తెనాలిలోనే మొదలైన లొల్లి..
యాత్ర మూడోరోజు తెనాలిలో ప్రవేశించింది. తెనాలి పట్టణంలోని ఐతానగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. పోలీసులు కుదరదన్నారు. ఐతానగర్ మీదుగా పర్మిషన్ లేదన్నారు.
అమరావతి రైతుల పాదయాత్ర ఉత్తరాంధ్ర చేరుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందోననే అనుమానాలు బలంగా ఉన్నాయి. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు అది పాదయాత్ర కాదు దండయాత్ర అంటూ మండిపడుతున్నారు. ఆ దండయాత్రను అడ్డుకుంటామని ఆల్రడీ స్టేట్‌మెంట్లు కూడా ఇచ్చారు. ఇటు టీడీపీ నేతలు ఘన స్వాగతం పలుకుతాం.. మనల్ని ఆపేదెవరంటూ ప్రతి సవాళ్లు విసిరారు. ఈ క్రమంలో యాత్ర ఉత్తరాంధ్ర చేరుకుంటే ఎలాంటి ఉద్రిక్తతలు ఎదురవుతాయో అనుకుంటున్నారు. అయితే అక్కడిదాకా వెళ్లాల్సిన అవసరం లేకుండా తెనాలిలోనే యాత్ర తోపులాట వరకు వచ్చింది.
యాత్ర మూడో రోజు తెనాలిలో ప్రవేశించింది. తెనాలి పట్టణంలోని ఐతానగర్ మీదుగా వెళ్లాలని రైతులు భావించారు. పోలీసులు కుదరదన్నారు. ఐతానగర్ మీదుగా పర్మిషన్ లేదన్నారు. కారణం ఏంటని ఆరా తీస్తే అటు వైపు వైసీపీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ ఇల్లు ఉంది. అక్కడ ఉద్రిక్తత తలెత్తే అవకాశం ఉందని పోలీసులు అభ్యంతరం చెప్పారు. రోడ్డుకు అడ్డంగా బారికేడ్లు ఏర్పాటు చేశారు. స్థానికులు బారికేడ్లను తోసేయడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు వారిని అదుపు చేసేందుకు తీవ్రంగా ప్రయత్నించడంతో తోపులాట జరిగింది.
ఎమ్మెల్యే ఇంటి వైపు నుంచి వెళ్లాల్సిందే..
తెనాలి స్థానిక టీడీపీ నేతలు అమరావతి యాత్రకు మద్దతుగా కదలి వచ్చారు. వారంతా ఐతానగర్‌లో ఎమ్మెల్యే ఇంటి ముందు నుంచి యాత్ర వెళ్లాల్సిందేంటూ పట్టుబట్టారు. పోలీసులు ససేమిరా అనడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆ తర్వాత అమరావతి రైతులే వెనక్కి తగ్గారు. న్యాయస్థానం అనుమతితో తాము యాత్ర చేస్తున్నామని, ఆ అనుమతులను తాము ధిక్కరించబోమని చెప్పారు. పోలీసులు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాల్లోనే యాత్ర ముందుకు సాగుతుందని హామీ ఇచ్చారు. దీంతో యాత్ర ప్రశాంతంగా ముందుకు కదిలింది. తెనాలిలోనే ఇంత హడావిడి జరిగితే, ముందు ముందు ఇంకెలాంటి పరిస్థితులు ఎదురవుతాయోననే ఆందోళన అందరిలో నెలకొంది.
కర్నూలులో న్యాయవాదుల నిరసన..
అమరావతి రైతులు పాదయాత్ర పేరుతో టీడీపీ నేతలు ఉత్తరాంధ్రపై దండయాత్ర చేస్తున్నారని కర్నూలులో న్యాయవాదులు నిరసన తెలిపారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని వారు డిమాండ్ చేశారు. కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు మోసం చేశారని అన్నారు. రాయలసీమలో అడుగు పెట్టే నైతిక హక్కు చంద్రబాబుకు లేదని చెప్పారు. కర్నూలుకి న్యాయ రాజధాని కావాలని డిమాండ్ చేస్తూ రాయలసీమలోని అన్ని కోర్టుల్లో గురువారం విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు న్యాయవాదులు.