విలీన గ్రామాలు - ఆరని మంటలు.. సరిహద్దుల్లో వంటా వార్పు..
ఈ నిరసన కార్యక్రమంలో విలీన గ్రామాల ప్రజలతోపాటు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొనడం విశేషం.
రెండు తెలుగు రాష్ట్రాలు విడిపోయిన ఎనిమిదేళ్ల తర్వాత ఇప్పుడు సరిహద్దు గ్రామాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎటపాక మండలం టాక్ ఆఫ్ ది 2 స్టేట్స్ గా మారింది. ఎటపాక మండలంలోని ఐదు గ్రామాల ప్రజలు తెలంగాణలో కలవాలంటూ ఇటీవల తీర్మానం చేశారనే వార్త సంచలనం కాగా.. ప్రజా ప్రతినిధులంతా నిన్న సమావేశమై తాము ఏపీలోనే ఉంటామంటూ ప్రకటించారు. అయితే ఈరోజు ఉదయం నుంచి ఎటపాక మండలం చెన్నంపేట గ్రామం వద్ద భారీ ధర్నా చేపట్టారు ఐదు గ్రామాల ప్రజలు. వంటా వార్పు కార్యక్రమం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో విలీన గ్రామాల ప్రజలతోపాటు, భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య పాల్గొనడం విశేషం.
గోదావరి వరదల తర్వాత పోలవరం ఎత్తు, విలీన గ్రామాల పునఃవిలీనం అనే అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పోలవరం ఎత్తు విషయంలో ఆల్రడీ విమర్శలు ప్రతి విమర్శలు వెలుగు చూశాయి. విలీన గ్రామాల విషయంలో కూడా ఇరు రాష్ట్రాల నేతలు మాటల తూటాలు పేల్చుకున్నారు. కానీ స్థానికులు ఏమనుకుంటున్నారనేదే ప్రధాన అంశం కాబోతోంది. స్థానిక ప్రజలు తమను తెలంగాణలో కలపాలంటూ ఇప్పటికే తీర్మానం చేశారనే వార్తలొస్తున్నాయి. కానీ అక్కడి ప్రజా ప్రతినిధులు తాము ఏపీలోనే ఉంటామని తెగేసి చెబుతున్నారు. కొంతమంది రియల్ ఎస్టేట్ వ్యాపారులే భద్రాచలం ప్రాంతంలో తమను కలిపేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
ఈ వాదనలు ఎలా ఉన్నా ఈరోజు వంటా వార్పు కార్యక్రమంలో ఈ వ్యవహారం బాగా హైలెట్ అవుతోంది. ఎటపాక మండలంలోని కన్నాయిగూడెం, పిచుకలపాడు, గుండాల, పురుషోత్తమ పట్నం, ఎటపాక గ్రామస్తులు హైవే పక్కన వంటా వార్పు నిర్వహించారు. వరదల సమయంలో తెలంగాణ సహకారం లేకపోతే తమ ప్రాణాలు నట్టేట్లో కలిసి పోయేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైద్యం, విద్య, వ్యాపార పరంగా కొన్ని దశాబ్దాలుగా ఉమ్మడి రాష్ట్రంలోని భద్రాచలం, కొత్తగూడెం, ఖమ్మంలతో కొనసాగిన అనుబంధమే తమకు అన్ని విధాల అనుకూలంగా ఉందని అంటున్నారు గుండాల వాసులు. రాష్ట్ర విభజనలో తమను ఏపీలో కలపడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు. మొత్తమ్మీద కొంతమంది తెలంగాణలో కలవాలనడం, మరికొంతమంది ఏపీలోనే కొనసాగుతామనడంతో ఐదు గ్రామాల పరిస్థితి కాస్త గందరగోళంగానే ఉంది.