నిప్పులకొలిమిలా ఏపీ.. వడగాలులతో జనం ఉక్కిరిబిక్కిరి
గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా యర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. మరో 5 చోట్ల 45 డిగ్రీలు దాటింది.
ఆంధ్రప్రదేశ్ నిప్పుల గుండంలా మారుతోంది. ఏప్రిల్ మూడో వారం కూడా ముగియకముందే ఉష్ణోగత్రలు చాలాచోట్ల 45 డిగ్రీలు దాటేశాయి. మరోవైపు వడగాలుల తీవ్రతకు జనం అల్లాడిపోతున్నారు. తీవ్రమైన ఉష్ణోగ్రతలకు ఉక్కపోతతో కోస్తాలో జనం బెంబేలెత్తిపోతున్నారు.
45.8 డిగ్రీల ఉష్ణోగ్రత
గురువారం అల్లూరి సీతారామరాజు జిల్లా యర్రంపేట, పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడల్లో 45.8 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత రికార్డయింది. మరో 5 చోట్ల 45 డిగ్రీలు దాటింది. రాష్ట్రవ్యాప్తంగా 16 మండలాల్లో టెంపరేచర్ 44 డిగ్రీలు దాటి జనాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తోంది.
వడగాలులతో బెంబేలు
గురువారం 84 మండలాల్లో తీవ్ర వడగాలులు, 120 మండలాల్లో వేడి గాలులు వీచాయి. ఈ 200 మండలాల్లో జనం బయటికి రావడానికే భయపడే పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఈ సంఖ్య మరింత పెరిగి 91 మండలాల్లో తీవ్ర వడగాలులు, 245 మండలాల్లో వడగాలులు వీచే అవకాశం ఉందని ఏపీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ సంస్థ ప్రకటించింది.