బాబు, రేవంత్ భేటీ ఎప్పుడు..? తెలుగు రాష్ట్రాల రాజకీయాలు ఆసక్తికరం

ఎన్డీఏ నేత చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవానికి కాంగ్రెస్ నేతగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తారని ఆశించలేం కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధంతో అది సాధ్యం కాదని కూడా చెప్పలేం.

Advertisement
Update:2024-06-05 07:34 IST

తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. చంద్రబాబు శిష్యుడిగా పేరున్న రేవంత్ రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కావడం, ఏపీలో ఇప్పుడు బాబు సీఎం కాబోతుండటంతో ఇరు రాష్ట్రాల రాజకీయ సంబంధాలు మరోసారి చర్చకు వస్తున్నాయి. తెలంగాణ ఏర్పాటు తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల మధ్య విభజన సమస్యలు అపరిష్కృతంగానే ఉన్నాయి. వీటన్నిటికీ ఇప్పుడు ఫుల్ స్టాప్ పడుతుందో లేదో చూడాలి.

విభజన తర్వాత రెండు రాష్ట్రాల తొలి ముఖ్యమంత్రులైన చంద్రబాబు, కేసీఆర్ మధ్య పెద్దగా సత్సంబంధాలు లేవు. ఆ మాటకొస్తే ఏపీ సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారోత్సవానికి కేసీఆర్ వచ్చారు, ఆ తర్వాత పలు సందర్భాల్లో కలిశారు కానీ.. మళ్లీ దూరం పెరిగింది. ఏపీ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేతల విమర్శలు, దానికి వైసీపీ నేతల కౌంటర్లు ఇలా కాలం గడిచింది. ఇటీవల తెలంగాణలో బీఆర్ఎస్ ఓటమి తర్వాత కేసీఆర్ ని మరోసారి సీఎం హోదాలో జగన్ పరామర్శించారు. ఇక రేవంత్ రెడ్డి, జగన్ మధ్య ఏమాత్రం సత్సంబంధాలు లేవనే విషయం తెలిసిందే. కనీసం జగన్ తనను విష్ చేయలేదని రేవంత్ రెడ్డి నేరుగా మీడియా ముందే కుండబద్దలు కొట్టారు. ఇక ఇప్పటి పరిస్థితిలో కాస్త మార్పు ఉంది. పేరుకి ఎన్డీఏ, ఇండియా కూటమి నేతలే అయినా.. చంద్రబాబు, రేవంత్ రెడ్డి మధ్య ఉన్న అనుబంధం అందరికీ తెలిసిందే. ఆ అనుబంధంతోనే ఇరు రాష్ట్రాల మధ్య మళ్లీ స్నేహ సంబంధాలు బలపడతాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ ఫలితాల తర్వాత తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ ఆసక్తికరంగా మారింది. చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి శుభాకాంక్షలు చెబుతూ.. సత్సంబంధాలు కొనసాగిస్తూ, కమస్యలు పరిష్కరించుకుంటూ తెలుగు రాష్ట్రాలను అభివృద్ధి పథంవైపు నడుపుదామని రేవంత్ రెడ్డి ట్వీట్ వేశారు.


చంద్రబాబు ఈనెల 9న ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. ఎన్డీఏ కూటమి కార్యక్రమానికి, కాంగ్రెస్ నేతగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వస్తారని ఆశించలేం కానీ, తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధంతో అది సాధ్యం కాదని కూడా చెప్పలేం. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయనేది వేచి చూడాలి. 

Tags:    
Advertisement

Similar News