చంద్ర‌బాబు శిష్యుడిని అంటే చెప్పుతో కొట్టండి

ఏ రకంగా చూసినా రేవంత్ టీడీపీకి సహకరించే అవకాశాలు కనబడటంలేదు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కానని రేవంత్ పదేపదే చెబుతున్నారు.

Advertisement
Update:2023-12-09 12:17 IST

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి మరీ విచిత్రంగా తయారైంది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే హస్తం పార్టీ నేతలతో పాటు టీడీపీ నేతలు కూడా సంబరాలు చేసుకుంటున్నారు. గాంధీభవన్‌లో టీడీపీ జెండాలు పట్టుకుని కేరింతలు కొట్టడమే ఆశ్చర్యంగా ఉంది. రేవంత్ రెడ్డి ప్రమాణస్వీకారం సమయంలో కూడా ఎల్బీ స్టేడియంలోనూ టీడీపీ జెండాలు క‌నిపించాయి. అయితే ఈ హడావుడి ఎక్కువై కొందరు కాంగ్రెస్ నేతలతో గొడవ కూడా అయ్యిందని తెలిసిందే.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే టీడీపీ హడావుడి ఎందుకు..? ఎందుకంటే.. రాబోయే ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూడా అధికారంలోకి రావటం ఖాయమని చెప్పేసుకుంటున్నారు. వీళ్ళ పైత్యానికి ప్రధాన కారణం ఎల్లోమీడియానే. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రేవంత్ రెడ్డి సీఎం అయితే ఏపీలో జగన్‌కు ఇబ్బందులు మొదలైనట్లే అని పదేపదే ఎల్లోమీడియా రాస్తోంది. దాంతో తమ్ముళ్ళు సంతోషం పట్టలేకుండా ఉన్నారు.

జగన్ మీద ద్వేషంతో ఎల్లోమీడియా ఏదిపడితే అది రాసేస్తోంది. నిజానికి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటానికి, రేవంత్ ముఖ్యమంత్రి అవటానికి ఏపీ రాజకీయాలకు ఎలాంటి సంబంధాలు లేవు. తెలంగాణ ఎన్నికల ఫ‌లితాలు ఏపీ ఎన్నికల్లో పెద్దగా ప్రభావం చూపే అవకాశాలు లేవనే చెప్పాలి. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావటం కన్నా.. చంద్రబాబునాయుడుతో పొత్తుకు నరేంద్రమోడీ అంగీకరిస్తే టీడీపీకి ఉపయోగం ఉంటుందేమో. రెండు ప్రభుత్వాలు సహకరించుకునేది వేరు, రెండు పార్టీలు సహకరించుకునేది వేరని టీడీపీ శ్రేణుల‌తో పాటు ఎల్లోమీడియా కూడా మరచిపోతోంది.

ఏ రకంగా చూసినా రేవంత్ టీడీపీకి సహకరించే అవకాశాలు కనబడటంలేదు. చంద్రబాబుకు తాను శిష్యుడిని కానని రేవంత్ పదేపదే చెబుతున్నారు. తాను చంద్రబాబు శిష్యుడినని ఎవరైనా అంటే చెప్పుతీసుకుని కొట్టమని బహిరంగంగానే పిలుపిచ్చారు. ఈ విషయాన్ని తమ్ముళ్ళు మరచిపోయి గాంధీభవన్లో సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తున్నారంటే వీళ్ళని ఏమనాలి...? ఏదేమైనా తెలంగాణలో టీడీపీ తమ్ముళ్ళ అత్యుత్సాహం చివరకు చంద్రబాబు మెడకు చుట్టుకుంటుందేమో అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

Tags:    
Advertisement

Similar News