పోలింగ్ కి కొన్ని గంటల ముందు టీడీపీ-వైసీపీ ట్విట్టర్ వార్
చంద్రబాబు వీడియోకి వైసీపీ సోషల్ మీడియా విభాగం మళ్లీ కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన అంశాన్నే తాము ప్రస్తావించాము కానీ, కొత్తగా చేర్చింది ఏదీ లేదంటున్నారు వైసీపీ నేతలు.
ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో ముస్లిం రిజర్వేషన్ల అంశం హాట్ టాపిక్ గా మారే అవకాశముంది. ప్రచారం ముగిసినా కూడా ఈ అంశంపై టీడీపీ, వైసీపీ మధ్య సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది. ముస్లింలకే కాదు, ఎస్సీ, ఎస్టీలకు కూడా రిజర్వేషన్ల వల్ల ఒరిగిందేంటి అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటల్ని వైసీపీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అంటే చంద్రబాబు.. ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకం అని తేలిపోయిందని వైసీపీ అంటోంది. బీజేపీ కూడా ముస్లిం రిజర్వేషన్లకు వ్యతిరేకమేనని, చంద్రబాబు కూడా పోలింగ్ కి ముందే తన నిజస్వరూపం బయటపెట్టారని వైసీపీ సోషల్ మీడియా విభాగం కార్నర్ చేసింది.
చంద్రబాబు వివరణ..
ముస్లిం రిజర్వేషన్ల అంశం బాగా డ్యామేజింగ్ గా మారడంతో నేరుగా చంద్రబాబు తెరపైకి వచ్చారు. ఆయన వ్యక్తిగత ట్విట్టర్ ఖాతానుంచి పూర్తి వీడియో విడుదల చేశారు. అందులో తాను అన్నది ఒకటి, వైసీపీ చెప్పింది మరొకటి అని వివరణ ఇచ్చారు బాబు. రిజర్వేషన్లు మాత్రమే ఆయా వర్గాల అభివృద్ధికి సరిపోవని, వాటితోపాటు మరింత చేయూతనివ్వాలని తాను అన్నట్టు, దాన్ని వైసీపీ ఎడిట్ చేసినట్టు పేర్కొన్నారు చంద్రబాబు.
చంద్రబాబు వీడియోకి వైసీపీ సోషల్ మీడియా విభాగం మళ్లీ కౌంటర్ ఇచ్చింది. ఆయన చెప్పిన అంశాన్నే తాము ప్రస్తావించాము కానీ, కొత్తగా చేర్చింది ఏదీ లేదంటున్నారు వైసీపీ నేతలు. ఆయన చెప్పింది చెప్పినట్టే పోస్ట్ చేసినా, ఫేక్ వీడియో అంటూ తమపై నిందలు వేస్తున్నారని అన్నారు. తాము చెప్పింది అబద్ధం అయితే, 4 శాతం రిజర్వేషన్లు తీసివేయబోమంటూ చెప్పే ధైర్యం చంద్రబాబుకి ఉందా అని ట్విట్టర్లో నిలదీశారు.