బాధితుల పేర్లు, అడ్రస్‌లు మీకు ఇవ్వాలా..?
రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతుంటే ప్రభుత్వంలో ఉండి కళ్లున్నా చూడలేని కబోదుల్లా టీడీపీ నేతలు మారారని వైసీపీ అంటోంది.
వినుకొండ హత్య తర్వాత ఏపీలో శాంతిభద్రతల అంశంపై తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. నేషనల్ మీడియా కూడా ఈ వ్యవహారంపై ఫోకస్ పెట్టడంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలు చేపట్టింది. జగన్ పర్యటన తర్వాత పోలీసులపై ఒత్తిడి మరింత పెరిగింది. మరోవైపు ఏపీలో హత్యాకాండలు ఆగడంలేదు. కారణాలేవైనా రోజుకో హత్య జరుగుతున్నట్టు సోషల్ మీడియాలో వీడియోలు బయటపడుతున్నాయి. వీటిని పోలీసులు ఆపగలరా, ఆ స్థాయిలో ప్రతి వ్యక్తికి రక్షణ ఇవ్వగలరా అనే విషయాలు పక్కనపెడితే వరుస హత్యలు, అఘాయిత్యాలు రాష్ట్ర ప్రభుత్వానికి మచ్చతెచ్చేలా ఉన్నాయి. ఈ విషయంలో కూటమి ప్రభుత్వం ఇప్పటికే సీరియస్ గా ఉంది. వైసీపీ ఆరోపణలను తిప్పికొడుతోంది. వినుకొండ పరామర్శకు వచ్చిన జగన్ ఫేక్ లెక్కలు చెబుతున్నారని, అవే నిజమైతే ఆ హత్యలకు సంబంధించిన పేర్లు, అడ్రస్ లు ఇవ్వాలని కోరారు ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు. శాంతిభద్రతల అంశంపై సీఎం చంద్రబాబు చాలా సీరియస్‌గా ఉన్నారని చెప్పారాయన.
టీడీపీ డిమాండ్ కి వైసీపీ కూడా కౌంటర్ ఇచ్చింది. ఏపీలో శాంతి భద్రతలు ఎంతలా క్షీణించాయో వినుకొండలో జరిగిన హత్యాకాండ ప్రత్యక్ష నిదర్శనం అని వైసీపీ అంటోంది. రాష్ట్రంలో జరిగిన హత్యలు, అఘాయిత్యాలు, దౌర్జన్యాలపై జగన్ చెప్పినవన్నీ అక్షర సత్యాలని, వాటిని ఒప్పుకుంటే జనం మొహంపై ఉమ్మేస్తారని టీడీపీ నేతలు భయపడుతున్నారని వైసీపీ ఎద్దేవా చేస్తోంది. బాధితుల పేర్లు, అడ్రస్‌లు మీకు ఇవ్వాలా? అంటూ ఆ పార్టీ ట్వీట్ చేసింది.
ప్రభుత్వంలో ఉండి రాష్ట్రంలో ప్రతిరోజు హత్యలు జరుగుతుంటే కళ్లున్నా చూడలేని కబోదుల్లా టీడీపీ నేతలు మారారని వైసీపీ అంటోంది. నడిరోడ్లపై నరికి చంపేస్తున్నా ఇప్పటి వరకు కనీసం ఒక్క బాధిత కుటుంబం ఇంటికైనా ప్రభుత్వం తరపున నేతలు వెళ్లి పరామర్శించలేదని, వారి రాక్షసానందానికి ఇంకెంత మంది బలి అవ్వాలని వైసీపీ ప్రశ్నిస్తోంది.