మీరు గూండాలు.. కాదు మీరే రౌడీలు
గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ ఇప్పుడు టీడీపీ నేతలు దెబ్బతీశారని, కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు జగన్.
ఏపీలో కొత్త ప్రభుత్వం ఇంకా ఏర్పడకముందే గొడవలు, అల్లర్లు పెచ్చుమీరాయి. అయితే ఈ గొడవలకు కారణం ఎవరు..? దాడులు చేస్తోంది ఎవరు..? బాధితులు ఎవరు..? అనేదానిపై ఎవరికి వారే సొంత వ్యాఖ్యానాలు చెప్పుకుంటున్నారు. టీడీపీ నేతలు దాడులు చేస్తున్నారని, అమాయక వైసీపీ కార్యకర్తల్ని హింసిస్తున్నారని వైసీపీ అంటోంది. వైసీపీవాళ్లే కావాలని కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని, దాడులపై టీడీపీ కేడర్ అప్రమత్తంగా ఉండాలని చంద్రబాబు అంటున్నారు. మొత్తానికి గొడవలు జరుగుతున్న విషయాన్ని ఇద్దరు నేతలు అంగీకరిస్తూనే.. కారణం మీరంటే మీరంటూ నిందలు వేసుకుంటున్నారు.
ఏపీలో శాంతిభద్రతలు అదుపు తప్పాయి, యంత్రాంగం నిర్వీర్యం అయిపోయింది, ఆటవిక పరిస్థితులు తలెత్తాయంటూ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై టీడీపీ నేతలు ఉన్మాదంతో దాడి చేస్తున్నారని అన్నారాయన. పార్టీనుంచి పోటీ చేసిన అభ్యర్థులకే రక్షణ లేకుండా పోయిందన్నారు. గడచిన ఐదేళ్లలో పాలనా సంస్కరణలు, పేదలను ఆదుకునే కార్యక్రమాలతో రాష్ట్రానికి వచ్చిన పేరు ప్రఖ్యాతులన్నింటినీ ఇప్పుడు టీడీపీ నేతలు దెబ్బతీశారని, కేవలం మూడురోజుల్లోనే హింసాయుత రాష్ట్రంగా ఏపీని మార్చారని మండిపడ్డారు జగన్. బాధితులకు తాము అండగా ఉంటామని, గవర్నర్ వెంటనే జోక్యం చేసుకోవాలని కోరుతూ ట్వీట్ చేశారు.
చంద్రబాబు మాత్రం ఇవన్నీ వైసీపీ కవ్వింపు చర్యలేనంటూ మండిపడ్డారు. వైసీపీ నేతలు, కార్యకర్తలు రెచ్చగొట్టే చర్యలకు పాల్పడినా, టీడీపీ వాళ్లు మాత్రం సంయమనం పాటించాలన్నారు. పోలీసులు శాంతి భద్రతలు అదుపులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తప్పంతా వైసీపీదేనంటున్నారు చంద్రబాబు. గతంలో ఏ ఎన్నికల తర్వాత కూడా ఏపీలో ఇలాంటి ఘటనలు జరగలేదు. ఈసారి మాత్రం ఎన్నికల ముందు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎక్కువయ్యాయి. ఇరు పార్టీలు ఒకరినొకరు రెచ్చగొట్టుకునేలా మాట్లాడారు. ఎన్నికల తర్వాత చేతులకు పని చెప్పారు.