ఎన్డీఏ కూటమిలో విశాఖ కుంపటి..

జీవీఎల్ కి విశాఖ సీటు డిమాండ్ చేస్తూ స్థానికంగా వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జనజాగృతి పేరుతో విశాఖ లోక్ సభ స్థానం పరిధిలోకి వచ్చే 6 నియోజకవర్గాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు.

Advertisement
Update:2024-04-06 11:13 IST

ఏపీలో కూటమి కుదిరిందని, సీట్ల పంపకాలు పూర్తయ్యాయని మూడు పార్టీల నేతలు సంబరపడుతున్నా.. చాలా చోట్ల కేడర్ లో అసంతృప్తి ఉంది. కొన్నిచోట్ల టైమ్ చూసి దెబ్బకొట్టడానికి రెబల్స్ రెడీ అవుతున్నారు. విశాఖపట్నం లోక్ సభ స్థానం విషయంలో బీజేపీ తరపున టికెట్ ఆశించి భంగపడిన జీవీఎల్ నరసింహారావు వంటివారు ఇంకా పట్టువీడటం లేదు. ఆ సీటు తనకే కావాలంటూ ఆయన ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. విశాఖ బీజేపీకి అచ్చొచ్చిన సీటు అని, అలాంటి సీటుని త్యాగం చేయడం సరికాదని ఆయన అధిష్టానం పెద్దలకు చెబుతున్నారు. అదే సమయంలో ఇటు వైజాగ్ లో కూడా స్థానికంగా అలజడి సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కుటుంబ, కుల రాజకీయాలకు జీవీఎల్ బలయ్యారంటూ తాజాగా విశాఖలో ఫ్లెక్సీలు వెలిశాయి.

బీజేపీ తరపున విశాఖ ఎంపీగా పోటీ చేసేందుకు చాన్నాళ్లుగా జీవీఎల్ నరసింహారావు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు. వైజాగ్ నుంచి వివిధ కార్యక్రమాలు చేపట్టడం, కేడర్ ని సిద్ధం చేయడం, నియోజకవర్గాల వారీగా ఆఫీస్ లు ఏర్పాటు చేసి, పార్టీ నేతల్ని ఉత్సాహపరచడం చేశారు. తీరా ఎన్నికల టైమ్ కి పొత్తుల్లో ఆయన చిత్తయ్యారు. పొత్తులో భాగంగా బీజేపీకి 6 లోక్ సభ సీట్లు కేటాయించినా అందులో జీవీఎల్ లాంటి సీనియర్ పేరు మిస్సవడం విశేషం. ఉద్దేశపూర్వకంగానే ఆయన్ను పక్కకు తప్పించారనేది నిజం. నారా లోకేష్ తోడల్లుడు శ్రీ భరత్ కోసం ఆ సీటు జీవీఎల్ కు లేకుండా చేశారు, ఆ సీటే కాదు, అసలు ఆయన్ను పోటీలో లేకుండానే పక్కకు తప్పించారు.

సీఎం రమేష్, సుజనా చౌదరి వంటి బీజేపీలోని చంద్రబాబు బ్యాచ్ కి టికెట్లు వచ్చాయి కానీ, జీవీఎల్ వంటి సీనియర్ ని పక్కనపెట్టడంతో పార్టీ కేడర్ లో కూడా అసంతృప్తి మొదలైంది. ఎలాగైనా వైజాగ్ సీటు దక్కించుకోవాలనుకుంటున్న జీవీఎల్ వెనక్కి తగ్గేది లేదంటున్నారు. తాజాగా జీవీఎల్ కి విశాఖ సీటు డిమాండ్ చేస్తూ స్థానికంగా వెలసిన ఫ్లెక్సీలు కలకలం రేపుతున్నాయి. జనజాగృతి పేరుతో విశాఖ లోక్ సభ స్థానం పరిధిలోకి వచ్చే 6 నియోజకవర్గాల్లో పోస్టర్లు ఏర్పాటు చేశారు. కుటుంబ, కుల రాజకీయాలకు జీవీఎల్ ని బలిచేశారంటూ నినాదాలు రాశారు. ఇప్పుడీ విషయాన్ని లైట్ తీసుకున్నా.. రేపు జీవీఎల్ అభిమానులు టీడీపీకి వ్యతిరేకంగా పనిచేస్తే మొదటికే మోసం వస్తుందనే భయం చంద్రబాబులో కూడా ఉంది. కానీ భావి రాజధానిగా పేరు తెచ్చుకున్న వైజాగ్ సీటుని బీజేపీకి వదిలేయడం బాబుకి ఇష్టం లేదు. దీంతో ఈ వ్యవహారం ఇంకా హాట్ హాట్ గానే ఉంది. అటు జీవీఎల్ కు వైజాగ్ సీటు ఇవ్వడం పురంధేశ్వరికి కూడా ఇష్టం లేదు. చంద్రబాబు-పురంధేశ్వరి చేసిన కుట్రకు జీవీఎల్ బలయ్యారు. ఇప్పుడు సీటు కోసం పోరాటం చేస్తున్నారు. 

Tags:    
Advertisement

Similar News