చెల్లికి మళ్లీ పెళ్లి..ఏమా కథ..! ఏంటా ట్విస్ట్..?
విశాఖలో 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అదానీ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకి శంకుస్థాపన చేశారని, వారికి ఇచ్చిన భూములు తీసేసుకుని మళ్లీ ఇప్పుడు అదే డేటా సెంటర్‌కి మరోసారి ఫౌండేషన్ వేయడం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ నేతలు.
విశాఖపట్టణం పరిపాలనా రాజధాని అని ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఎప్పుడో ప్రకటించారు. మూడు రాజధానులు అని అంటున్నా, వైసీపీ పెద్దల మనసులో ఉన్న ఒకే ఒక్క రాజధాని విశాఖ. ఈ దిశగానే అక్కడ నిర్మాణాలు, ప్రాజెక్టులు తలపెడుతున్నారు. తాజాగా విశాఖలో అదానీ డేటా సెంటర్, భోగాపురం ఎయిర్‌పోర్టు శంకుస్థాపన కార్యక్రమాలను చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నారు. అతిపెద్ద రెండు ప్రాజెక్టులను విశాఖ కేంద్రంగా మొదలుపెట్టే సందర్భాన్ని వైసీపీ చాలా పెద్ద ఎత్తున వాడుకోవాలని ప్రచారానికి ప్లాన్ చేసుకుంది. అయితే ఈ రెండు శంకుస్థాపనలపై టీడీపీ వ్యంగ్యంగా స్పందిస్తూ చర్చ ఆరంభించింది.
యమలీల సినిమాలో తోటరాముడు క్యారెక్టర్ వేసిన తనికెళ్ల భరణి ‘‘నాకో బుల్లి చెల్లి నేడే గల్లీలో దానికి పెళ్లి ఇలా నా చెల్లికి పెళ్లి జరగాలి మళ్లీ మళ్లీ’’ అని చెప్పిన కవితని వాడుకుని తెలుగుదేశం పార్టీ వైసీపీపై సెటైర్లు సంధిస్తోంది. భోగాపురం ఎయిర్ పోర్టుకి 4 ఏళ్ల క్రితమే చంద్రబాబు శంకుస్థాపన చేశారని, దానికి జగన్ మళ్ళీ శంకుస్థాపన చెయ్యడమేంటని కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్ గజపతిరాజు ఎద్దేవా చేశారు. అప్పట్లో రాజుగారే కేంద్ర విమానయానశాఖా మంత్రి కూడా. మేము చేసిన ఎయిర్ పోర్ట్ నిర్మాణానికి కేటాయించిన భూమిలో ఐదు వందల ఎకరాలు తగ్గించి, ఇప్పుడు మరోసారి శంకుస్థాపన చేయడమేంటని ప్రశ్నించారు. విశాఖలో 2019 సంవత్సరంలో ఫిబ్రవరి 14న అదానీ డేటా సెంటర్ అండ్ టెక్నాలజీ పార్క్ ఏర్పాటుకి శంకుస్థాపన చేశారని, వారికి ఇచ్చిన భూములు తీసేసుకుని మళ్లీ ఇప్పుడు అదే డేటా సెంటర్‌కి మరోసారి ఫౌండేషన్ వేయడం హాస్యాస్పదం అంటున్నారు టీడీపీ నేతలు.
కడప జిల్లా వాసుల కల అయిన ఉక్కు కర్మాగారం విషయంలో ముచ్చటగా మూడోసారి జగన్ రెడ్డి శంకుస్థాపన చేశారని, గతంలో ఎవరైనా చేసిన శంకుస్థాపనలు పూర్తికి చొరవ చూపుతారని, జగన్ రెడ్డి మాత్రం తాను మళ్లీ శంకుస్థాపన చేయడానికే మొగ్గు చూపిస్తారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు.
నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి కడప ఉక్కు పరిశ్రమ కోసం 2007 జూన్ 10న భూమిపూజ చేశారు. కడప ఉక్కు ఫ్యాక్టరీ నిర్మిస్తామంటూ మరో ప్రాంతంలో 2018లో అప్పటి సీఎం చంద్రబాబు శంకుస్థాపన రాయి వేశారు. 2019లో అధికారంలోకి వచ్చిన జగన్ మోహన్ రెడ్డి అదే ఏడాది డిసెంబర్ 23న స్టీల్ ప్లాంట్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.
ఇలా గతంలో చేసిన శంకుస్థాపనలకే మళ్లీ పేరుమార్చి చేయడం వల్ల సీఎం జగన్ మోహన్ రెడ్డిని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఏ సీఎం అయినా తనకంటే ముందు ముఖ్యమంత్రులు ఆరంభించిన పనులని కొనసాగిస్తారని, జగన్ రెడ్డి మాత్రం గత ముఖ్యమంత్రులు చేసిన శంకుస్థాపనలను ఆపేసి, కొత్తగా మళ్లీ శంకుస్థాపనలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.