జగన్ కి ప్రతిపక్ష హోదా ఇచ్చామా..? తెలంగాణ అడిగితే అన్నీ ఇచ్చేస్తామా..?
7 విలీన మండలాల విషయంలో చంద్రబాబు ఘనతని జగన్ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటున్నారు టీడీపీ నేతలు.
విభజన తర్వాత ఏపీలో కలిపిన 7 మండలాలు వెనక్కి..
టీటీడీలో భాగం ఇచ్చేందుకు రెడీ..
వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలోనూ భాగం
కృష్ణపట్నం, మచిలీపట్నం, గంగవరం పోర్టుల్లో భాగం...
ఇలా తెలంగాణ లేవనెత్తిన ప్రతిపాదనలకు ఏపీ సీఎం చంద్రబాబు సుముఖత వ్యక్తం చేసినట్టు వైసీపీ ప్రచారం చేస్తోంది. ఏపీ ఫర్ సేల్ అంటూ ఓ ట్వీట్ వేసింది. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీలో ఈ మేరకు కీలక నిర్ణయాలు తీసుకున్నట్టుగా చెబుతున్నారు వైసీపీ నేతలు. కూటమి ప్రభుత్వం ఏపీ ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని మండిపడుతున్నారు.
టీడీపీ కౌంటర్..
తెలంగాణ కోర్కెలను తీర్చే విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు సొంత రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారనే ఆరోపణలపై టీడీపీ కూడా ఘాటుగా స్పందించింది. 11 అసెంబ్లీ స్థానాలు సాధించిన జగన్ ప్రతిపక్ష హోదా అడిగితే ఇచ్చామా..? అంటూ టీడీపీ అధికారిక ట్విట్టర్ ఖాతానుంచి బదులు వచ్చింది. ఎవరో ఏదో అడిగారని ఇచ్చేస్తామా? అని ప్రశ్నిస్తున్నారు టీడీపీ నేతలు. ఇవన్నీ ఫేక్ న్యూస్ అని మండిపడుతున్నారు.
7 మండలాల విషయంలో చంద్రబాబు ఘనతని జగన్ గుర్తు చేసినందుకు థ్యాంక్స్ అంటున్నారు టీడీపీ నేతలు.2014లో ప్రమాణ స్వీకారానికి ముందే, తెలంగాణ నుంచి 7 మండలాలు తెచ్చింది చంద్రబాబు అని చెప్పారు. జగన్ మాత్రం 2019లో ప్రమాణ స్వీకారానికి ముందే, ఏపీ భవనాలు తెలంగాణకు ఇచ్చారని ఆరోపించారు. దశాబ్దాల బందర్ పోర్టు కల సాకారం చేసింది చంద్రబాబు అయితే, కాకినాడ పోర్టు ద్వారా బియ్యం స్మగ్లింగ్ చేసిన దొంగలు వైసీపీ నేతలంటూ కౌంటర్ ఇచ్చారు. రాష్ట్ర ప్రయోజనాలు కాపాడేందుకు చంద్రబాబు ముందు వరుసలో ఉంటారని టీడీపీ బదులిచ్చింది.