ఏపీలో అరగంటకో అప్పు.. గంటకో ముప్పు
వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో చూపుతున్న కేటాయింపులు వాస్తవంగా ఖర్చు చేయడం లేదని, రూ.9 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై వేసి..రూ.1.80 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకిచ్చామంటున్నారని ధ్వజమెత్తారు.
ఏపీ బడ్జెట్ పై టీడీపీ నేతలు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు, అంకెల గారడీ అంటూ విమర్శించారు. బడ్జెట్ తర్వాతి రోజు అసెంబ్లీ సమావేశాలకు నిరసన ప్రదర్శనగా తరలి వెళ్లారు. జగన్ పాలనలో రాష్ట్రం ‘అప్పుల ఆంధ్రప్రదేశ్’గా మారిందని.. ఆర్థిక అత్యవసర పరిస్థితి వైపు పయనిస్తోందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం అప్పుల మీదే బతుకుతోందని మండిపడ్డారు. గత నాలుగేళ్లలాగే ఈ బడ్జెట్ కూడా మోసాలమయం అంటూ విమర్శించారు. కేటాయింపులు ఘనంగా ఉన్నా ఖర్చు మాత్రం కనిపించడం లేదని దుయ్యబట్టారు. ఈ బడ్జెట్ భవిష్యత్తులో జగన్ కి ఉరితాడుగా మారుతుందని హెచ్చరించారు.
అచ్చెన్నాయుడు నేతృత్వంలో ఆ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అసెంబ్లీ సమీపంలోని తుళ్లూరు ట్రాఫిక్ పోలీసు స్టేషన్ వద్ద ఆందోళన చేపట్టారు. ‘జగన్ పాలనలో అరగంటకో అప్పు.. గంటకో ముప్పు’ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులతో అసెంబ్లీ వరకు పాదయాత్రగా వెళ్లారు. GSDP 14శాతం పెరిగిందని చెబుతున్న ప్రభుత్వం, ఎంత మందికి ఉద్యోగాలిచ్చిందని, ఎన్ని పరిశ్రమలు తెచ్చిందని ప్రశ్నించారు. నెల నెలా జీతాల కోసం ఉద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందిన్నారు. అప్పులు విపరీతంగా పెరిగిపోయాయని, అభివృద్ధి జాడలేదని చెప్పారు టీడీపీ నేతలు.
ఏపీలో ప్రతి 100మందిలో 47శాతం మందికి అప్పులు ఉన్నాయని, దేశంలో ఏపీలోనే అప్పుల పరిస్థితి దారుణంగా ఉందన్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేలు అచ్చెన్నాయుడు, బాలకృష్ణ, నిమ్మకాయల చినరాజప్ప, ఆదిరెడ్డి భవానీ, గోరంట్ల బుచ్చయ్యచౌదరి, రామరాజు.. ఎమ్మెల్సీలు బీటీ నాయుడు, చిక్కాల రామచంద్రరావు ఈ నిరసన ప్రదర్శనలో పాల్గొన్నారు. వ్యవసాయ రంగానికి బడ్జెట్ లో చూపుతున్న కేటాయింపులు వాస్తవంగా ఖర్చు చేయడం లేదని, రూ.9 లక్షల కోట్ల అప్పుల భారాన్ని ప్రజలపై వేసి..రూ.1.80 లక్షల కోట్లు బటన్ నొక్కి ప్రజలకిచ్చామంటున్నారని ధ్వజమెత్తారు.