పవన్‌ కల్యాణ్‌ను నిస్సహాయతలోకి నెట్టేసిన చంద్రబాబు

కాపు సామాజికవర్గం నేతలు పవన్‌ కల్యాణ్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌పై, చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు.

Advertisement
Update:2024-03-01 12:01 IST

జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు పూర్తిగా నిస్సహాయ స్థితిలోకి నెట్టేశారు. ఒక రకంగా వ్యూహాత్మకంగా పవన్‌ కల్యాణ్‌ను తక్కువ చేయడానికి పూనుకున్నారని చెప్పవచ్చు. ఇది పవన్‌ కల్యాణ్‌కే కాకుండా వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కూడా వ్యతిరేకంగా పనిచేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. కేవలం 24 శాసనసభా స్థానాలు మాత్రమే ఇవ్వడం ద్వారా జనసేన అంత బలంగా లేదని చంద్రబాబు సంకేతాలు ఇచ్చారు. ఆ తర్వాత బలహీనమైన స్థానాలను కేటాయించడం ద్వారా ఎన్నికల తర్వాత జనసేన మరింత బలహీనపడాలనే ఎత్తు వేశారు.

చంద్రబాబు పన్నిన ఉచ్చులో చిక్కుకున్న పవన్‌ కల్యాణ్‌ దాన్ని సమర్థించుకోలేక నిస్పృహలోకి జారిపోయినట్లు కనిపిస్తున్నారు. అందువల్లనే ఫ్రెస్టేష‌న్‌తో సభల్లో ఊగిపోతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మీద అర్థం పర్థం లేని వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇష్టం వచ్చిన రీతిలో ఆయన మాట్లాడతున్నారు. తనకు దక్కిన 24 సీట్లలో మెజారిటీ సీట్లు గెలుస్తామనే ధీమాను కూడా ఇవ్వలేకపోతున్నారు.

రాష్ట్రంలో కాపు సామాజిక వర్గం 24 శాతం ఉన్నారని, అందులోనూ అన్ని సీట్లు ఒక్క సామాజికవర్గానికే ఇవ్వడం కుదరదని, 4 శాతం మాత్రమే ఉన్న కమ్మ సామాజికవర్గానికి తొలి విడత జాబితాలో 22 సీట్లు ఇచ్చారని, మలి జాబితాల్లో కమ్మ సామాజికవర్గానికి మరిన్ని సీట్లు దక్కే అవకాశాలున్నాయని, ఇది అన్యాయమని ప‌లువురు అంటున్నారు. రాష్ట్రంలోని కాపు సామాజికవర్గానికి చెందిన నాయకులు వివిధ పార్టీల్లో ఉన్నారు. అందువల్ల కాపు సామాజికవర్గం ఓట్లు గంపగుత్తగా టీడీపీ, జనసేన కూటమికి పడుతాయనే గ్యారంటీ లేదు. తమ పార్టీకి అన్యాయం జరిగిందనే ఆగ్రహంతో ఉన్న జనసేన ఓట్లు టీడీపీకి బదిలీ అయ్యే సూచనలు కనిపించడం లేదు. అదే సమయంలో టీడీపీ ఓట్లు జనసేనకు బదిలీ అయ్యే అవకాశాలు కూడా తక్కువే.

ఇక పోతే, కాపు సామాజికవర్గం నేతలు పవన్‌ కల్యాణ్‌పై కారాలు మిరియాలు నూరుతున్నారు. మాజీ ఎంపీ చేగొండి హరిరామ జోగయ్య పవన్‌ కల్యాణ్‌పై, చంద్రబాబుపై తీవ్రంగా మండిపడుతున్నారు. కాపు నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా గుర్రుగా ఉన్నారు. ఆయన చేసిన ప్రకటనే అందుకు ఉదాహరణ. చంద్రబాబు కారణంగానే పవన్‌ కల్యాణ్‌ ముద్రగడను దూరం చేసుకున్నారు. ఇది జనసేనకు తీవ్రమైన ఎదురు దెబ్బ. ముద్రగడ చేరి ఉంటే, జనసేనకు కొంత ఊపు వచ్చి ఉండేది. ఆచరణాత్మకమైన ముద్రగడ సలహాల వల్ల జనసేనకు మంచి జరిగి ఉండేది. మరోవైపు, కాపు సమైక్య వేదిక నాయకులు పవన్‌ కల్యాణ్‌పై తీవ్రంగా మండిపడుతూ ప్రకటన చేశారు. దీనివల్ల జనసేన కాపు సామాజికవర్గానికి చెందిన మద్దతును చాలా వరకు కోల్పోయే పరిస్థితి ఏర్పడింది. ఇది జనసేనకు మాత్రమే కాకుండా, టీడీపీకి కూడా నష్టమే.

వచ్చే ఎన్నికల తర్వాత జనసేన ఉనికిని నామమాత్రం చేస్తే టీడీపీకి, తన కుమారుడు నారా లోకేష్‌కు ఎదురు ఉండదని చంద్రబాబు బహుశా భావించి ఉంటారు. కానీ, దానివల్ల మొదటికే మోసం రావచ్చు. చంద్రబాబు దీన్ని గమనించడం లేదు.

Tags:    
Advertisement

Similar News