వైసీపీ పంచాంగం ఇలా.. టీడీపీ పంచాంగం అలా..
వైసీపీ పంచాంగం మోదీ, జగన్, కేసీఆర్.. ముగ్గురి జాతకం బాగుందని చెబితే, టీడీపీ పంచాంగం మాత్రం కేంద్రంలో మోదీ దశ బాగుందని, మోదీకి-జగన్ కి మధ్య సంబంధాలు చెడిపోతాయని, ఏపీలో చంద్రుడు, ఇంద్రుడవుతాడంటూ మరో రకంగా చెప్పుకొచ్చింది.
గతంలో పంచాంగ శ్రవణం ఎవరు చేసినా.. దాదాపుగా ఫలితాలన్నీ ఒకేలా ఉండేవి. రాను రాను పంచాంగాలలో రాజకీయ పార్టీల పంచాంగాలు వేరు అనే పరిస్థితి వచ్చింది. ఈ ఏడాది కూడా ఎవరి పంచాంగం వారికి సంతోషాన్నిచ్చింది. ముఖ్యమంత్రి అధికారికంగా పాల్గొన్న పంచాంగ శ్రవణంలో రాజకీయాల ప్రస్తావన రాలేదు కానీ.. వైసీపీ నేతలకు అత్యంత సన్నిహితుడిగా పేరున్న శారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర చెప్పిన పంచాంగం మాత్రం వైసీపీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపింది. ఏపీ సీఎం జగన్ కు అంతా శుభం జరుగుతుందని చెప్పారు. అంతే కాదు, ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ సీఎం జగన్, తెలంగాణ సీఎం కేసీఆర్ అందరి జాతకాలు భేషుగ్గా ఉన్నాయన్నారు. పరోక్షంగా మరోసారి అధికారం వీరిదే అనే సంకేతాలిచ్చారు.
కాల సర్ప దోషం కారణంగా మూడేళ్ళుగా దేశం ఇబ్బందులు పడుతోందన్నారు స్వరూపానందేంద్ర. కొత్త ఏడాది చతుర్ గ్రహ కూటమితో కొత్త సంవత్సరం ప్రారంభమవుతుందని, దీనివల్ల దేశానికి ఇబ్బందులు తప్పవన్నారు. కానీ ప్రధాని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల జాతకాలు బాగుండటంతో ప్రజలకు కొంతవరకు ఇబ్బందులు తొలగుతాయన్నారు. దేశమంతా వాహన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని, ఎండలు, వడదెబ్బలు ఎక్కువగా ఉంటాయన్నారు. విదేశాల్లో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తాయన్నారు.
ఇక టీడీపీ పంచాంగం విషయానికొస్తే.. అమరావతిలోని పార్టీ కార్యాలయంలో చంద్రబాబు పంచాంగం విన్నారు. ఆయనకు, టీడీపీ నేతలకు పంచాంగకర్తలు.. దేశ, రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామలు జరుగుతాయని చెప్పారు. ఏపీలో ప్రధాన ప్రతిపక్షం బలపడుతుందని చెప్పారు. జాతీయ రాజకీయాల్లో అధికారంలో ఉన్నవారు మరింత బలపడతారన్నారు. ఒకరకంగా టీడీపీకి ఆశాజనకంగానే పంచాంగం వినిపించారు. పార్టీ ఫిరాయింపులు ఆశ్చర్యం కలిగిస్తాయని, అన్ని రాజకీయ పార్టీలు తమ బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాయన్నారు.
ఏపీ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటుందని, పరిపాలనలో న్యాయ పరమైన చిక్కులు ఎదురవుతాయని, ధరల పెరుగుదల మీద ప్రధాన ప్రతిపక్షం పోరాటం చేస్తుందని తెలిపారు టీడీపీ పంచాంగకర్తలు. ఆహార కొరత ఏర్పడే ప్రమాదం ఉందని, విద్య వైద్య రంగాల్లో స్కాములు బయటపడతాయని చెప్పారు. అభివృద్ది కంటే అనారోగ్యకరమైన పోటీ ఎక్కువగా ఉందన్నారు. కేంద్ర-రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గ్యాప్ పెరుగుతుందని కూడా సెలవిచ్చారు. చంద్రుడు ఇంద్రుడవ్వాలని, తెలుగు రాష్ట్రాలకు శుభం జరగాలి, యువగళం నవగళం కావాలంటూ ముక్తాయించారు.
వైసీపీ పంచాంగం మోదీ, జగన్, కేసీఆర్.. ముగ్గురి జాతకం బాగుందని చెబితే, టీడీపీ పంచాంగం మాత్రం కేంద్రంలో మోదీ దశ బాగుందని, మోదీకి-జగన్ కి మధ్య సంబంధాలు చెడిపోతాయని, ఏపీలో చంద్రుడు, ఇంద్రుడవుతాడంటూ మరో రకంగా చెప్పుకొచ్చింది. ఈ పంచాంగాలలో ఏది నిజమో, ఏది ముఖ స్తుతికి చెప్పిందో.. మరో ఏడాదిలో తేలిపోతుంది.