పవన్ మీకు దేవుడు.. ఆయనకు గుడికట్టండి
వాస్తవానికి వైసీపీ మాజీ ఎంపీ భరత్, పవన్ ని పొగడాలనుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలపై సెటైర్లు వేయాలనుకునే క్రమంలో పరోక్షంగా పవన్ ని ఆకాశానికెత్తేశారు.
ఏపీలో పవన్ కల్యాణ్ చరిష్మా వల్లే టీడీపీ అభ్యర్థులు ఎన్నికల్లో గెలిచారని అన్నారు వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్. పవన్ కల్యాణ్ కు టీడీపీ ఎమ్మెల్యేలంతా గుడికట్టి పూజ చేయాలని సూచించారు. ఏపీలో టీడీపీకి సొంతగా గెలిచేంత సీన్ లేదని, ఈరోజు కూటమి అధికారంలో ఉందంటే అదంతా పవన్ గొప్పతనమేనన్నారు భరత్. వాస్తవానికి ఆయన పవన్ ని పొగడాలనుకోలేదు. టీడీపీ ఎమ్మెల్యేలపై సెటైర్లు వేయాలనుకునే క్రమంలో పరోక్షంగా పవన్ ని ఆకాశానికెత్తేశారు.
రాజమండ్రిలో యుద్ధం..
2019లో ఎంపీగా గెలిచిన భరత్.. ఈ ఎన్నికల్లో రాజమండ్రి సిటీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు చేతిలో ఓడిపోయారు. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మాటల యుద్ధం మొదలైంది. నియోజకవర్గంలో శిలా ఫలకాలు పడగొడుతున్నారని భరత్ తీవ్ర ఆరోపణలు చేశారు. తన ప్రచార వాహనాన్ని కూడా టీడీపీ నేతలు తగలబెట్టారన్నారు. తీరా విచారణలో వైసీపీ కార్యకర్తే ఆ పనిచేశారని తేలింది. దీంతో టీడీపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టింది. భరత్ పెద్ద నటుడని, రాజకీయాలు మానేసి ఆయన తిరిగి సినిమాల్లోకి వెళ్లాలంటూ వెటకారం చేశారు ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు.
దమ్ముంటే ఫేస్ బుక్ లైవ్ పెట్టు..
ప్రచార రథం తగలబెట్టిన ఘటనలో దేవుడి గుడిలో ప్రమాణం చేయడానికి సిద్ధమా అంటూ ఛాలెంజ్ చేసిన మార్గాని భరత్.. తాజాగా ఫేస్ బుక్ లైవ్ కి సిద్ధమా అంటూ ఆదిరెడ్డి వాసుకి సవాల్ విసిరారు. అసలు రాజమండ్రిలో ఆదిరెడ్డి వాసు అంటే ఎవరికీ తెలియదని, ఆయన ఫేస్ బుక్ లైవ్ పెట్టినా వేలల్లోనే వ్యూస్ ఉన్నాయని చెప్పారు. తాను లైవ్ పెడితే లక్షల్లో జనం చూస్తున్నారని, అదే తనకు ఆయనకు ఉన్న తేడా అని వివరించారు. ఈ ఫేస్ బుక్ లైవ్ ఛాలెంజ్ ని టీడీపీ నేతలు వెటకారం చేస్తున్నారు. భరత్ కు ఫేస్ బుక్ లో ఉన్న క్రేజ్ ప్రజల్లో లేదని, అందుకే ఆయన ఎన్నికల్లో ఓడిపోయారని అంటున్నారు.