తమ్ముళ్ళకే లోకేష్ షాకిచ్చాడా? 2019 రిపీటేనా?
పాదయాత్రలో తనతో పాటు నడుస్తున్న నేతలు, కార్యకర్తలను చూసి లోకేష్‌కు ఆవేశం వచ్చేసింది. వెంటనే మైక్ అందుకుని నేతలు, కార్యకర్తలతో పాటు జనాల్లోని ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలే రిపీటవుతాయని తనకు కచ్చితంగా అనిపిస్తోందన్నారు.
నారా లోకేష్ మాటలు గురించి ప్రపంచానికి కొత్తగా చెప్పేదేమీ లేదు. పది మాటలు మాట్లాడితే అందులో ఎన్ని తప్పులుంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ఏదో చెబుదామని అనుకుని ఇంకేదో చెప్పేస్తుంటారు. విషయ పరిజ్ఞానం లేకపోవటం, విషయాలు తెలుసుకోవాలని అనుకోకపోవటంతో పాటు నోటి మీద అదుపు లేకపోవటం కూడా పెద్ద లోపమైపోయింది. ఇలాంటి కారణాలతోనే పాదయాత్రలో అబాసుపాలవుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లాలో పాదయాత్ర చేస్తున్నపుడు లోకేష్ చెప్పిన మాటతో తమ్ముళ్ళు ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.
ఇంతకీ విషయం ఏమిటంటే పాదయాత్రలో తనతో పాటు ఫాలో అవుతున్న నేతలు, కార్యకర్తలను చూసి లోకేష్‌లో ఆవేశం వచ్చేసింది. వెంటనే మైక్ అందుకుని పాదయాత్రలో కనిపిస్తున్న జనాల స్పందన చూస్తుంటే తనకు సంతోషంగా ఉందన్నారు. నేతలు, కార్యకర్తలతో పాటు జనాల్లోని ఉత్సాహం చూస్తుంటే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ 2019 ఎన్నికల ఫలితాలే రిపీటవుతాయని తనకు కచ్చితంగా అనిపిస్తోందన్నారు. ఏ ఎన్నికల ఫలితాలు రిపీట్ అవుతాయని లోకేష్ చెప్పాలని అనుకున్నారో ఎవరికీ తెలియలేదు.
లోకేష్ మాటతో నేతలు, కార్యకర్తలకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లయ్యింది. నిజానికి 2019 ఎన్నికలు చంద్రబాబు నాయుడుతో పాటు టీడీపీకి పీడకలలాంటిది. 1982లో పార్టీ పెట్టిన దగ్గర నుండి అంత ఘోరమైన ఓటమి ఎప్పుడూ ఎదురుకాలేదు. 175 సీట్ల అసెంబ్లీలో టీడీపీకి వచ్చింది 23 మాత్రమే. ఎన్నికల ఫలితాల దెబ్బకు చంద్రబాబుతో పాటు పార్టీ కూడా ఒక్కసారిగా కుదేలైపోయింది. ఆ దెబ్బ నుండి చంద్రబాబు ఇంకా తేరుకోలేదనే చెప్పాలి.
ఇదంతా పక్కనపెడితే లోకేష్ కూడా మంత్రి హోదాలో పోటీచేసి మంగళగిరిలో ఓడిపోయారు. ఆ విషయం కూడా లోకేష్‌కు గుర్తున్నట్లులేదు. ఇప్పుడే కాదు యాక్టివ్ రాజకీయాల్లోకి వచ్చిన దగ్గర నుండి చాలా సందర్భాల్లో లోకేష్ ఇలాగే మాట్లాడారు. ఒకసారి టీడీపీని ఉరివేయాలన్నారు. మరోసారి అవినీతి, కుల పిచ్చి ఉన్న పార్టీ ఏదన్నా ఉందంటే అది టీడీపీ మాత్రమే అన్నారు. సైకిల్ పోవాలంటు చేసిన నినాదాలకు కొదవేలేదు. సైకిల్‌కు ఓట్లేయద్దని పిలుపిచ్చిన ఘటనలు కూడా ఉన్నాయి. 2019 ఫలితాలే రిపీటవుతాయని చెప్పింది మాత్రం హైలైటనే చెప్పాలి.