వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్‌కు.. టీడీపీ నేతల సహకారం!
అస్మిత్‌రెడ్డికి, చింతమనేనికి ఇదే సెక్షన్ల కింద కేసు నమోదయినా హైకోర్టు బెయిలిచ్చింది. కాబట్టి అదే సెక్షన్ల కింద కేసు నమోదయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా బెయిల్ రావడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు.
ఈవీఎం ధ్వంసం కేసులో బెయిల్ దక్కినా ఎన్నికల వేళ హింసకు పాల్పడ్డారంటూ నమోదైన 3 కేసుల్లో మాచర్ల ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి బెయిల్ ఇవ్వద్దని ఓ పక్క టీడీపీ నేతలు, మరోపక్క పోలీసులు హైకోర్టులో వాదనలు వినిపించారు. కౌంటింగ్ ఏజెంట్లను నియమించుకోవడం, కౌంటింగ్ ప్రక్రియను దగ్గరుండి పర్యవేక్షించడం వంటి కీలక పనులున్నందున బెయిల్ ఇవ్వాలని పిన్నెల్లి లాయర్ వాదించారు. అయితే ఈ కేసులో పిన్నెల్లికి బెయిల్ వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఇందుకు ఓ రకంగా టీడీపీ నేతలే కారణం కావడం విశేషం.
అస్మిత్‌రెడ్డి, చింతమనేనికి బెయిల్ ఇచ్చారుగా..!
తాడిపత్రి టీడీపీ అభ్యర్థి జేసీ అస్మిత్‌రెడ్డిపైనా ఇలాగే ఎన్నికల అనంతరం హింసకు సంబంధించిన కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఏలూరు జిల్లా దెందులూరులో టీడీపీ అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌పైనా ఇలాంటి కేసులే పెట్టారు. అయితే వారు బెయిల్ కోసం అప్లయి చేశారు. కోర్టు వారికి బెయిల్ ఇచ్చింది కూడా.
టీడీపీ వాళ్లకు ఇచ్చారు కాబట్టి పిన్నెల్లికీ ఇస్తారు!
అస్మిత్‌రెడ్డికి, చింతమనేనికి ఇదే సెక్షన్ల కింద కేసు నమోదయినా హైకోర్టు బెయిలిచ్చింది. కాబట్టి అదే సెక్షన్ల కింద కేసు నమోదయిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా బెయిల్ రావడం ఖాయమని న్యాయ నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు అస్మిత్‌రెడ్డి, చింతమనేనిలకు ఈ సెక్షన్ల కింద కేసు నమోదయినా బెయిల్ ఇవ్వాలని వాదించిన పోసాని వెంకంటేశ్వర్లే ఇప్పుడు పిన్నెల్లికి బెయిల్ ఇవ్వకూడదని వాదించడం గమనార్హం. ఒకవేళ కోర్టు బెయిల్ ఇవ్వడానికి సుముఖంగా లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తరఫు న్యాయవాది ఈ అంశాలను లేవనెత్తడం ఖాయమని, అందుకే బెయిల్ ఇస్తారని వైసీపీ నేతలు ధీమాగా ఉన్నారు.