మొన్న రామ్ ప్రసాద్, నిన్న కొలికపూడి.. ప్రజలు గమనిస్తున్నారు జాగ్రత్త..!

మొన్న రామ్ ప్రసాద్ రెడ్డికి నేరుగా సీఎం ఫోన్ చేసి చీవాట్లు పెడితే, నిన్న కొలికపూడి ఇష్యూని పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో ఖండించారు. పార్టీ అనుకూల మీడియా కూడా వారి చర్యలను ఖండించడం విశేషం.

Advertisement
Update: 2024-07-03 01:56 GMT

మొన్న మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి భార్య ఓ ఎస్సైపై రుసరుసలాడారు. మా అక్క తోపు, తురుము అంటూ కొంతమంది అనుచరులు ఎలివేషన్లు ఇచ్చుకోవచ్చు కానీ.. జనాలు ఇలాంటి అమర్యాదకర ప్రవర్తనను హర్షించరు. నిన్న ఎమ్మెల్యే కొలికపూడి.. వైసీపీ నేత ఇంటిని జేసీబీతో కూల్చేసేందుకు బయలుదేరారు. రోడ్డుపై నానా రచ్చ చేశారు. అనుచరులు ఆయన్ను పొగడ్తలతో ఆకాశానికెత్తేయొచ్చు కానీ, సామాన్య ప్రజలు మాత్రం ఈ ప్రతీకార చర్యలను ఏమాత్రం మెచ్చుకోరు. ఇలాంటి వ్యవహారాలతో వారికే కాదు, పార్టీకి కూడా చెడ్డపేరు వస్తుంది. అయితే అధిష్టానం మాత్రం ఈ విషయాల్లో మరీ మూర్ఖంగా వ్యవహరిస్తున్నట్టు లేదు. మొన్న రామ్ ప్రసాద్ రెడ్డికి నేరుగా సీఎం ఫోన్ చేసి చీవాట్లు పెడితే, నిన్న కొలికపూడి ఇష్యూని పార్టీ నేతలే సామాజిక మాధ్యమాల్లో ఖండించారు. పార్టీ అనుకూల మీడియా వారిది అత్యుత్సాహమంటూ కథనాలిచ్చింది.

గతంలో ఏం జరిగింది..?

గత ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్ ని చెడామడా తిట్టేవారు. వ్యక్తిగత విషయాలను కూడా తెరపైకి తెచ్చి వారి జీవితాలను రోడ్డునపడేసినంత పని చేశారు. చంద్రబాబు ఏడ్చారు, పవన్ బాధపడ్డారు, ఇలాంటి మాటలు మంచిది కాదు అని లోకేష్ కూడా మీడియా సమావేశాల్లో చెప్పుకొచ్చారు. కానీ వైసీపీలో ఏ ఒక్కరూ అలా మాట్లాడుతున్నవారిని నిలువరించలేదు, సరికదా ఓ రేంజ్ లో ఎలివేషన్లు ఇచ్చారు. మా అన్న తోపు, మా అక్క నోటికి అడ్డులేదు, మా నాయకుల వెంట్రుక కూడా పీకలేరు, మా వాళ్ల జోలికొస్తే సోషల్ మీడియాలో పరువు తీసేస్తామంటూ చెప్పుకొచ్చారు. ఇక్కడ టీడీపీ వాళ్లు కూడా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. కానీ జనం మాత్రం మంత్రి పదవుల్లో ఉండి కూడా నోరు అదుపులో పెట్టుకోలేని నేతల్నే ఎక్కువగా గమనించారు. వారి మాటల్నే గుర్తు పెట్టుకున్నారు. అప్పటికప్పుడు ప్రజలెవరూ వారి తప్పుల్ని ఎత్తి చూపలేదు కానీ, అలా తిట్టినవారిలో ఏ ఒక్కరూ అసెంబ్లీలో అడుగు పెట్టలేకపోయారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే జనానికి ఏది నచ్చుతుందో, ఏది నచ్చదో అనేది నాయకుడే స్వయంగా అంచనా వేయాలి. అలా అంచనా వేయలేనప్పుడు పరాజయాలే పలకరిస్తాయి. మాటల యుద్ధంలో మాదే పైచేయి అని సంతోషపడితే మాత్రం ఓటు యుద్ధంలో ప్రజలు మరోలా తీర్పునిస్తారు, అప్పుడు ఆ ఫలితాన్ని తట్టుకోవడం కష్టంగా మారుతుంది.

కూటమి హయాంలో వ్యక్తిగత ప్రతీకార దాడులు జరుగుతున్నాయనే ఆరోపణలున్నాయి. అయితే నాయకులు మరీ శృతి మించితే నేరుగా అధిష్టానం జోక్యం చేసుకోవడం, లిమిట్స్ లో ఉండాలని చెప్పడం ఇక్కడ విశేషం. నిజంగానే అధిష్టానం నేతల్ని అదుపులో ఉంచితే ప్రజలు హర్షిస్తారు. బుగ్గ గిల్లి జోలపాడినట్టుగా సీన్ క్రియేట్ చేస్తే మాత్రం మొదటికే మోసం వస్తుంది. 

Tags:    
Advertisement

Similar News