ఉద్యోగాలివ్వు.. లేదంటే సెలవు పెట్టి పో.. మున్సిపల్‌ కమిషనర్‌పై టీడీపీ దౌర్జన్యం

ఇప్పటికే పలుమార్లు కమిషనర్‌తో అమర్యాదకరంగా ప్రవర్తించిన వీరు, సోమవారం ఆయన్ని ముట్టడించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని చుట్టుముట్టి బెదరగొట్టారు.

Advertisement
Update:2024-08-06 09:52 IST

ఏపీలో టీడీపీ నేతలు, కార్యకర్తలు అరాచకాలు పేట్రేగిపోతున్నాయి. టీడీపీ, జనసేన, బీజేపీలతో కూడిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వారి ఆగడాలకు అడ్డే లేకుండా పోతోంది. ఇది ప్రజాస్వామ్యం అనుకుంటున్నారో.. నియంతృత్వం అనుకుంటున్నారో.. అర్థం కాకుండా ఉంది వారి తీరు. వారికి నచ్చని అధికారి రాజీనామా చేసి వెళ్లిపోవాలంట.. వారు చెప్పింది చేయని అధికారి సెలవు పెట్టి వెళ్లిపోవాలంట.. వారి శృతిమించిన అకృత్యాలు మరింత వికృత రూపం దాల్చుతున్నాయనడానికి తాజాగా అన్నమయ్య జిల్లా రాజంపేటలో జరిగిన ఘటనే నిదర్శనం.

ఇంతకీ ఏం జరిగిందంటే..

అన్నమయ్య జిల్లా రాజంపేట మున్సిపల్‌ కార్యాలయంలో టీడీపీ వర్గీయులు సోమవారం వీరంగం వేశారు. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మున్సిపల్‌ కమిషనర్‌ నల్లా రాంబాబుపై దౌర్జన్యం చేశారు. ఇప్పటికే పలుమార్లు కమిషనర్‌తో అమర్యాదకరంగా ప్రవర్తించిన వీరు, సోమవారం ఆయన్ని ముట్టడించారు. అనారోగ్యంతో ఉన్న ఆయన్ని చుట్టుముట్టి బెదరగొట్టారు. బాత్‌రూమ్‌కు కూడా వెళ్లకుండా అడ్డుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ దుర్భాషలాడుతూ, కేకలు వేస్తూ ఇష్టారీతిగా ప్రవర్తించారు.

కమిషనర్‌ రాంబాబు విధుల్లో ఉన్న సమయంలో రాజంపేట రూరల్‌ టీడీపీ అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్య నాయుడు, తాళ్లపాకకు చెందిన గోవర్ధన్, ముళ్లగూరి సుబ్రహ్మణ్యం, మనుబోలు మస్తాన్, కొలిమివీధి రంగప్రసాద్, మేస్త్రీ వెంకటయ్య కుమారుడు, నందలూరు, రాజంపేటకు చెందిన పలువురు టీడీపీ కార్యకర్తలు మూకుమ్మడిగా వచ్చారు. గతంలో ఇక్కడ పని చేస్తూ మానేసిన తమవారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. తనకు ఆ అధికారం లేదని, సీడీఎంఏ నుంచి అనుమతి రావాలని కమిషనర్‌ చెప్పగా.. నాయకులు ఆగ్రహంతో ఊగిపోయారు. కమిషనర్‌ని అనరాని మాటలంటూ సెలవు పెట్టి వెళ్లిపోవాలని డిమాండ్‌ చేశారు. కుర్చీలో నుంచి లేచిన కమిషనర్‌ని వెనక్కి నెట్టి బలవంతంగా కూర్చోబెట్టారు. ఎక్కడికి పోతావంటూ బెదిరించారు.

ఈ సమాచారం అందుకున్న ఎస్‌ఐ మోహన్‌ గౌడ్‌ సిబ్బందితో అక్కడికి చేరుకున్నప్పటికీ.. పోలీసుల ముందే టీడీపీ నాయకులు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. దీంతో పోలీసులు కమిషనర్‌ను కారెక్కించి ఇంటికి పంపించారు. కొద్దిసేపటి తరువాత కార్యాలయానికి వచ్చిన కమిషనర్‌కి టీడీపీ వారు వినతిపత్రం ఇచ్చారు. తాము చెప్పిన వారిని ఉద్యోగంలోకి తీసుకోవాలని చెప్పారు. టీడీపీ నేతల వికృత చేష్టలపై కమిషనర్‌ రాంబాబు పట్టణ ఎస్‌ఐకి ఫిర్యాదు చేశారు. మున్సిపల్‌ కార్యాలయానికి వచ్చి తనను భయపెట్టడమేకాక, విధులకు ఆటంకం కలిగించారని పేర్కొన్నారు. తనకు రక్షణ కల్పించాలని కోరారు. ఈ ఫిర్యాదును కలెక్టరు, జేసీ, సబ్‌ కలెక్టర్‌లకు కూడా పంపించినట్టు కమిషనర్‌ వెల్లడించారు.

Tags:    
Advertisement

Similar News