కాకినాడ సెజ్‌లో బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు - కేంద్రానికి యనమల ఫిర్యాదు

ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల మత్స్యకారులు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 300 హేచరీలను ఈ ప్రాంతంలో నడుపుతున్నారని తెలిపారు. ఫార్మా పార్క్ ఏర్పాటుతో నీరు, నేల, గాలి, సముద్రం కాలుష్యమై రైతులు, మత్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.

Advertisement
Update:2022-09-01 14:15 IST


కాకినాడ సెజ్‌లో ఏర్పాటు చేయబోయే బల్క్ డ్రగ్ పార్క్ వల్ల పర్యావరణానికి తీవ్ర ముప్పు ఉందని, ఈ ప్రతిపాదనను తక్షణమే విరమించుకోవాలని కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శికి శాసన మండలి ప్రధాన ప్రతిపక్ష నేత యనమల రామకృష్ణుడు లేఖ రాశారు. లేఖ ప్రతులను జాతీయ హరిత ట్రిబ్యునల్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన‌ కార్యదర్శిలకు పంపి మీడియాకి విడుదల చేశారు. బహుళ-ఉత్పత్తి, ప్రత్యేక ఆర్థిక మండలి ప్రాజెక్ట్ అమలు ప్రయోజనం కోసం రైతుల నుంచి ప్రభుత్వం 8,500 ఎకరాల భూమిని సేకరించిందని పేర్కొన్నారు. ఇక్కడ పరిశ్రమల ఏర్పాటు వల్ల మత్యకారుల జీవనోపాధికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్సార్ హామీ ఇచ్చారని లేఖలో వివరించారు. తండ్రి ఇచ్చిన హామీకి విరుద్ధంగా తనయుడు ఇప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అరబిందో రియల్టీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేటు లిమిటెడ్ (ARIPL)కు ఫార్మా పార్క్ ఏర్పాటుకు ప్రణాళికలు వేస్తున్నారని ఫిర్యాదులో వివరించారు.

ఫార్మా పార్క్ ఏర్పాటు వల్ల మత్స్యకారులు జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతుందన్నారు. దాదాపు 300 హేచరీలను ఈ ప్రాంతంలో నడుపుతున్నారని తెలిపారు. ఫార్మా పార్క్ ఏర్పాటుతో నీరు, నేల, గాలి, సముద్రం కాలుష్యమై రైతులు, మత్యకారులు జీవనోపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. కోనసీమ‌ ప్రాంతంలో దాదాపు 50,000 మంది ప్రజల ఆహార ఉత్పత్తికి ఫార్మా తీవ్ర నష్టం కలిగిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫార్మా పరిశ్రమ ప్రతికూల ప్రభావాలపై రైతులు, మత్స్యకారులు ప్రజలు పెద్ద సంఖ్యలో ఇప్పటికే ఆందోళనలు చేస్తున్నారని వివరించారు. తమకు జరిగే నష్టంపై జాతీయ హరిత ట్రిబ్యునల్, కాలుష్య నియంత్రణ మండలికి స్థానికులు ఫిర్యాదు కూడా చేశారని తెలిపారు.

ఇప్పుడు కోనసీమ సెజ్ ప్రాంతంలో బల్క్ డ్రగ్ పార్క్‌ ఏర్పాటుకు ప్రణాళికలు సిద్ధం చేయటం ఆ ప్రాంత ప్రజలకు తీవ్ర హానికరంగా మారనుందన్నారు. ఇది భవిష్యత్తు తరాలపై ప్రభావం చూపుతుందని .. అంగవైకల్యం, మలబద్ధకం, అతిసారం, మగత, నొప్పి, చర్మ జీర్ణశయ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. భూములిచ్చిన రైతులకు పరిహారం చెల్లింపు కూడా ఇంకా పెండింగ్‌లోనే ఉందన్నారు. ఈ ప్రాజెక్టు పక్కనే ఉన్న హెటెరో డ్రగ్స్‌ ఇప్పటికే నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎన్‌జిటి రూ.6.94 కోట్ల పెనాల్టీ విధించిందని పేర్కొన్నారు. వాస్తవ పరిస్థితుల దృష్ట్యా ప్రతిపాదిత బల్క్ డ్రగ్ పార్క్‌ను విరమించటానికి పరిష్కార చర్యలను కోరుతున్నానని లేఖలో వివరించారు యనమల.

Tags:    
Advertisement

Similar News