పవన్, లోకేష్ మీటింగ్ లో మూడు తీర్మానాలు
త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రటిస్తామని తెలిపారు పవన్ కల్యాణ్. లోకేష్ మాత్రం నవంబర్ 1 న మేనిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
టీడీపీ, జనసేన సమన్వయ కమిటీ మీటింగ్ అంటూ ఊదరగొట్టినా.. అక్కడ సంచలన నిర్ణయాలేవీ తీసుకోలేదు. సంచలన ప్రకటనలు కూడా ఏమీ లేవు. మూడు తీర్మానాలు చేశామని సరిపెట్టారు. అవి కూడా కొత్తగా ఉన్నాయా అంటే అదీ లేదు. చంద్రబాబు అరెస్ట్ ని నిరసిస్తూ మొదటి తీర్మానం, వైసీపీ పాలన నుంచి ప్రజల్ని రక్షించాలని రెండో తీర్మానం, జనసేన-టీడీపీ కలసి నడవాలని మూడో తీర్మానం.. ఇలా సాగింది ఆ సమావేశం. అయితే తొలిసారి సమన్వయ కమిటీ సమావేశం కాబట్టి రాజమండ్రిలో హడావిడి కనపడింది. పార్టీ నేతల్లో సందడి నెలకొంది.
ఉమ్మడి మేనిఫెస్టోపై ప్రకటన..
నవంబర్ 1న ఉమ్మడి కార్యాచరణ ప్రకటిస్తామని తెలిపారు నేతలు. ఓటరు జాబితాల్లోని అక్రమాలపై క్షేత్రస్థాయిలో ఉమ్మడిగా పోరాటం చేయాలని నిర్ణయించారు. మేనిఫెస్టోపై ఇప్పటికే టీడీపీ ఓ అడుగు ముందుకేసింది. భవిష్యత్తుకి గ్యారెంటీ అంటూ మహాశక్తి పేరుతో పథకాలు ప్రకటించింది. చంద్రబాబు జైలుకి పోకుండా ఉంటే రెండో దఫా గ్యారెంటీలు ఈపాటికే బయటకు వచ్చి ఉండేవి. కానీ బాబు జైలుకి వెళ్లడంతో బ్రేక్ పడింది. ఇప్పుడు జనసేన కూడా జతకలిసింది కాబట్టి.. ఉమ్మడి మేనిఫెస్టో ప్రకటించడంపై చర్చ జరిగింది. త్వరలో కనీస ఉమ్మడి ప్రణాళిక ప్రటిస్తామని తెలిపారు పవన్ కల్యాణ్. లోకేష్ మాత్రం నవంబర్ 1 న మేనిఫెస్టో ప్రకటించి ప్రచారం ప్రారంభిస్తామని స్పష్టం చేశారు.
వ్యతిరేక ఓటు..
గతంలో కూడా పవన్ ఇదే మాట చెప్పారు, ఇప్పుడు సమన్వయ కమిటీ మీటింగ్ తర్వాత కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోమని మరోసారి స్పష్టం చేశారు. చంద్రబాబుకి సంఘీభావం తెలిపేందుకే రాజమండ్రిలో ఈ మీటింగ్ పెట్టుకున్నట్టు చెప్పారు పవన్. ఏపీకి వైసీపీ అనే తెగులు పట్టుకుందని, అది పోవాలంటే.. టీడీపీ-జనసేన వ్యాక్సిన్ అవసరం ఉందన్నారు. చంద్రబాబుని అకారణంగా జైలులో పెట్టారంటున్న పవన్, సాంకేతిక అంశాలతో ప్రభుత్వమే బెయిల్ రాకుండా చూస్తోందని మండిపడ్డారు.