ఫిల్మ్ సిటీ భేటీపై ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఏపీ రాజకీయ నాయకులు
రామోజీరావు-అమిత్ షా భేటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే రామోజీ.. ఈ భేటీలో తప్పకుండా పొత్తు విషయం ప్రస్తావిస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు.
తెలంగాణలో జరుగనున్న ఓ భేటీపై ఏపీలోని రాజకీయ నాయకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా రాబోయే ఎన్నికల్లో బీజేపీతో పొత్తును ఆశిస్తున్న జనసేన, తెలుగుదేశం నాయకులు ఈ భేటీలో ఏదో జరగబోతోందని ఊహిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో మీడియా మొఘల్‌గా పేరు తెచ్చుకున్న రామోజీ రావుతో కేంద్ర మంత్రి అమిత్ షా సమావేశం కాబోతుండటం చర్చనీయాంశంగా మారింది. అమిత్ షానే స్వయంగా ఫిల్మ్‌సిటీకి రానుండటం.. నాలుగేళ్ల తర్వాత అమిత్ షా- రామోజీరావు సుదీర్ఘ భేటీకి సిద్ధపడుతుండటం రాజకీయ వర్గాల్లో ఆసక్తి రేపుతోంది.
మునుగోడు ఉపఎన్నిక సందర్భంగా నిర్వహిస్తున్న బహిరంగ సభకు అమిత్ షా రానున్నారు. అక్కడ కేవలం 90 నిమిషాలు మాత్రమే ఉంటానని ఇప్పటికే బీజేపీ నాయకులకు చెప్పినట్లు తెలుస్తుంది. అయితే ఆ తర్వాత రోడ్డు మార్గంలో ఫిల్మ్ సిటీకి చేరుకొని.. 45 నిమిషాల పాటు రామోజీరావుతో భేటీ అవుతారని తెలుస్తుంది. ఎన్టీఆర్ కాలం నుంచి రామోజీరావు పూర్తిగా టీడీపీ సపోర్టర్‌గా ఉన్నారు. ఎన్టీఆర్‌ను ముఖ్యమంత్రిని చేసినా.. ఆ తర్వాత ఆయనను గద్దె దింపి చంద్రబాబును సీఎం కుర్చీలో కూర్చోబెట్టినా.. అదంతా రామోజీరావు చాణక్యమే అన్నది జగమెరిగిన సత్యం. మరోవైపు బీజేపీకి కూడా రామోజీ సన్నిహితంగానే మెలుగుతున్నారు. గతంలో బీజేపీ-టీడీపీ దోస్తీకి రామోజీరావే కారణమనే వ్యాఖ్యలు కూడా వినిపించాయి.
మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలో ప్రతిపక్ష నాయకురాలు సోనియాకు రెండో వరుసలో సీటు కేటాయించగా.. రామోజీరావుకు ఏకంగా మొదటి లైన్లోనే కూర్చోబెట్టడం ఆ మధ్య చర్చనీయాంశం అయ్యింది. 2018లో అమిత్ షా స్వయంగా ఫిల్మ్ సిటీకి వచ్చి రామోజీని కలిశారు. అయితే ఆ తర్వాత బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. అప్పటి నుంచి రెండు పార్టీల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. వైఎస్ జగన్ 2019లో టీడీపీని చిత్తుగా ఓడించిన తర్వాత చంద్రబాబు కూడా ఒంటరిగా మిగిలిపోయారు.
రాబోయే ఎన్నికల్లో కనుక టీడీపీ అధికారంలోకి రాకపోతే పార్టీని కాపాడుకోవడం చాలా కష్టం అవుతుందని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకే ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో బీజేపీతో జత కట్టాలని భావిస్తున్నారు. కానీ జాతీయ నాయకత్వం మాత్రం ఇప్పటికీ టీడీపీ, చంద్రబాబుపై గుర్రుగానే ఉన్నారు. ముఖ్యంగా 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు వ్యవహరించిన తీరు, మోడీపై చేసిన విమర్శలను బీజేపీ మర్చిపోలేకపోతోంది. టీడీపీ స్వయంగా కోరుతున్నా.. పొత్తు విషయం మాత్రం తేల్చడం లేదు. అయితే చంద్రబాబు విషయంలో ఇటీవల బీజేపీ కాస్త మెతక వైఖరి అవలంభిస్తున్నట్లు తెలుస్తుంది.
2024 అసెంబ్లీ ఎన్నికల సమయానికి బీజేపీతో పొత్తు ఉండేలా చంద్రబాబు పావులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో రామోజీరావు-అమిత్ షా భేటీ ఆసక్తికరంగా మారింది. టీడీపీకి అనుకూలంగా ఉండే రామోజీ.. ఈ భేటీలో తప్పకుండా పొత్తు విషయం ప్రస్తావిస్తారని తెలుగు తమ్ముళ్లు ఆశిస్తున్నారు. సరైన సమయంలో రామోజీ చక్రం తిప్పుతారని వాళ్లు అంచనా వేస్తున్నారు. కాగా, ఓం సిటీ వ్యవహారం కూడా ఈ భేటీలో చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఫిల్మ్ సిటీ లాగానే.. ఓ అద్భుతమైన ఆధ్యాత్మిక నగరాన్ని నిర్మించాలని రామోజీ కలలు కంటున్నారు. అయితే బీజేపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దానికి బ్రేక్ పడింది. ఈ భేటీలో దాన్ని ముందుకు తీసుకెళ్లేలా చర్చ జరుపుతారని తెలుస్తోంది. ఏదేమైనా తెలంగాణలో జరుగనున్న ఈ భేటీపై ఏపీ రాజకీయ నాయకులు ఎదురు చూస్తుండటం గమనార్హం.