తెలుగుదేశంలో అత్యంత సీనియర్ పతివాడకు ఘోర అవమానం
కేంద్ర మాజీ మంత్రి పూసపూటి అశోక్ గజపతిరాజుకి శిష్యుడు అని పేరుపడిన మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు నియామకంతో నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబం ఆగ్రహంగా ఉంది.
తెలుగుదేశం పార్టీలో అత్యంత సీనియర్ నేత, అత్యధికసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన రికార్డు కలిగిన పతివాడ నారాయణస్వామి నాయుడుని పార్టీ అధిష్టానం ఘోరంగా అవమానించింది. దశాబ్దాలుగా పార్టీకి వీరవిధేయుడిగా ఉన్న తనని కాదని, తనకు మాట మాత్రంగానైనా చెప్పకుండా నెల్లిమర్ల నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్‌ఛార్జిగా కర్రోతు బంగార్రాజుని నియమించడం పట్ల ఆగ్రహంగా ఉన్నారు. పార్టీకి సుదీర్ఘకాలంగా సేవలందించిన తన కుటుంబ సభ్యులకు గాని, సీనియర్ నాయకులకు గాని బాధ్యతలు అప్పగించకపోవడంపై కినుక వహించారు.
చాలా కాలంగా నెల్లిమర్ల నియోజకవర్గం టిడిపి ఇన్‌చార్జిని మార్చుతారనే ప్రచారం సాగుతోంది. అయితే పతివాడ నారాయణస్వామినాయుడు తనకి వయోభారం రీత్యా తన వారసులలో ఎవరో ఒకరికి ఇవ్వాలని చాలా కాలంగా పట్టుబడుతూ వచ్చారు. సేవాకార్యక్రమాల ద్వారా బాగా ఫేమస్ అయిన కడగల ఆనంద్ కుమార్, కంది చంద్రశేఖర్ వంటి వారుకూడా టిడిపి ఇన్‌చార్జి పదవి దక్కించుకునేందుకు తమ ప్రయత్నాలు చేశారు. చివరికి భోగాపురానికి చెందిన టిడిపి రాష్ట్ర కార్యదర్శి కర్రోతు బంగార్రాజు ఇన్‌చార్జి పదవి ఎగరేసుకుపోయారు.
కేంద్ర మాజీ మంత్రి పూసపూటి అశోక్ గజపతిరాజుకి శిష్యుడు అని పేరుపడిన మాజీ ఎంపీపీ కర్రోతు బంగార్రాజు నియామకంతో నియోజకవర్గంలో ఏడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించిన పతివాడ నారాయణస్వామి నాయుడు కుటుంబం ఆగ్రహంగా ఉంది.
మాజీమంత్రి పతివాడ నారాయణస్వామి నాయుడు తనయులు రాజకీయాలకు సరిపడరనుకుంటే, మనవడు తారకరామానాయుడుకి అయినా పదవి ఇవ్వాలని పతివాడ కుటుంబం టిడిపి అధిష్టానానికి విన్నవించింది. అయితే పతివాడ నారాయణస్వామి నాయుడుకి ఆరోగ్యం బాగాలేకపోవడం, కుమారుడు వైసీపీతో టై అప్ అయ్యాడనే ఆరోపణలు, మనవడు వయస్సు రీత్యా అనుభవం లేదనే కారణాలతో నియోజకవర్గ ఇన్‌చార్జి బాధ్యతలను కర్రోతు బంగార్రాజుకు అప్పగిస్తూ అధినాయకత్వం నిర్ణయం తీసుకుంది.
పెద్దాయన పతివాడ నారాయణస్వామి నాయుడు ఆశీస్సులు తీసుకునేందుకు కర్రోతు బంగార్రాజు వెళ్లగా, కలిసేందుకు నిరాకరించినట్టు సమాచారం. తన కుటుంబానికి పదవి ఇవ్వకపోవడం కంటే, తమకు చెప్పకుండా నియోజకవర్గ ఇన్‌చార్జిని ప్రకటించడంపై పతివాడ మరింత ఆగ్రహంగా ఉన్నారట. ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, పలు దఫాలు మంత్రిగా పనిచేసి, 2014లో ప్రోటెం స్పీకర్‌గా పనిచేసిన తనకు ఇచ్చే గౌరవం ఇదేనా అని నాయుడు మండిపడుతున్నారని తెలుస్తోంది. పార్టీలు మారకుండా, అవినీతి మరకలు అంటకుండా దశాబ్దాలుగా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు ఈ అవమానంతో నారాయణస్వామి నాయుడు కుంగిపోయారని అంటున్నారు.