కుప్పంలో చంద్రబాబు వినూత్న ప్రయోగం?

ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంలోని ఓటర్లందరినీ పార్టీ తరపున జియో ట్యాగింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయించారు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ విషయం బయటపడిపోతుందట.

Advertisement
Update:2022-11-20 11:00 IST

గడచిన నలబై ఏళ్ళుగా ప్రాతినిథ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు ఇప్పుడు కుప్పం నియోజకవర్గంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టడం ఏమిటని అనుకుంటున్నారు. భయం, అవును వచ్చే ఎన్నికల్లో గెలుపు భయమే చంద్రబాబుతో ఈపని చేయిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే కుప్పం నియోజకవర్గంలోని ఓటర్లందరినీ పార్టీ తరపున జియో ట్యాగింగ్ చేయిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక యాప్ తయారు చేయించారు. దీనివల్ల ఉపయోగం ఏమిటంటే వచ్చే ఎన్నికల్లో దొంగ ఓట్లు వేయించేందుకు ఎవరైనా ప్రయత్నిస్తే ఆ విషయం బయటపడిపోతుందట.

కుప్పం నియోజకవర్గంలో సుమారు 2.15 లక్షల ఓట్లున్నాయి. నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లోని ప్రతి గ్రామానికి టీడీపీ కార్యకర్తలు, నేతలు ఇల్లిల్లు తిరుగుతున్నారు. ఇంట్లోని మనుషులెంతమంది? ఎంత మంది ఓటర్లున్నారు? ఇంటి నుండి ఉద్యోగ, ఉపాధి అవసరాల కోసం ఎవరైనా బయటకు వెళ్ళిపోయారా? అనే వివరాలను సేకరిస్తున్నారు. ఆ వివరాలన్నింటినీ యాప్‌లో అప్‌లోడ్ చేస్తున్నారు. ప్రతి ఓటరు ఫొటోను తీసుకుని యాప్‌లో ఫీడ్ చేస్తున్నారు.

ఇవన్నీ ఎందుకు చేస్తున్నారంటే వచ్చే ఎన్నికల్లో వైసీపీ దొంగ ఓట్లతో తనను ఓడించేందుకు ప్రయత్నిస్తుందని చంద్రబాబు భయపడుతున్నారు. ఇంతకాలం ప్రత్యర్ధులను ఓడించేందుకు చంద్రబాబు చేసిన ప్రాక్టీసే ఇదంతా. కుప్పంలో భారీగా దొంగ ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిన విషయం అందరికీ తెలిసిందే. అంటే చంద్రబాబు వైఖరి ఎలాగుంటుందంటే తాను అధికారంలో ఉన్నపుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉంటే మరోలా ఉంటుంది.

రేపటి ఎన్నికల్లో గెలుపుపై చంద్రబాబులో భయం పెరిగిపోతోంది. తనను ఓడించాలని జగన్మోహన్ రెడ్డి కంకణం కట్టుకుని కూర్చున్నారు. దాంతో చంద్రబాబు అప్రమత్తమయ్యారు. ఇందులో భాగంగానే ఓటర్లకు జియో ట్యాగింగ్ ఏర్పాటు. టీడీపీ జియో ట్యాగింగ్ చేసిన ఓటర్ల జాబితాలో ఏదన్నా మార్పులు వస్తే పార్టీకి తెలిసిపోతుంది. దీనివల్ల వైసీపీ అదనంగా ఓటర్లను నమోదు చేయించటం సాధ్యంకాదని చంద్రబాబు అనుకుంటున్నారు. శాంతిపురం, రామకుప్పం, గుడుపల్లి, కుప్పం మండలాల్లోని 75 వేల కుటుంబాలకు జియో ట్యాగింగ్ చేయిస్తున్నారు. ఈ ప్రక్రియ చంద్రబాబుకు ఎంత మేర‌కు ఉపయోగపడుతుందో చూడాలి.

Tags:    
Advertisement

Similar News