కుప్పంపై డాక్యుమెంటరీ.. హడావిడిపడుతున్న టీడీపీ..
కుప్పంలో జగన్ అడుగుపెట్టడంతో టీడీపీలో హడావిడి బాగా పెరిగిపోయింది. కుప్పంకు చంద్రబాబు ఏం చేశారనేది ఇంతకు ముందు ఎప్పుడూ చెప్పుకోని పార్టీ ఇప్పుడు ఏకంగా డాక్యుమెంటరీ విడుదల చేసింది.
కుప్పంకు చంద్రబాబు ఏం చేశారు..? గతంలో ఎప్పుడు ఈ ప్రశ్న వినిపించినా టీడీపీ నుంచి పెద్దగా రియాక్షన్ ఉండేది కాదు. కుప్పంకు తాను ఏం చేసినా, చేయకపోయినా చెల్లుబాటయిపోతుందనే ధీమా చంద్రబాబులో ఉండేది. కానీ ఇప్పుడా ధీమా పోయింది. ఒకరకంగా జగన్ పర్యటనకు ముందే చంద్రబాబు కంగారు పడ్డారు. ఇప్పుడు ఏకంగా కుప్పం చేజారిపోయినంత టెన్షన్ పడుతున్నారు. ఆయన హడావిడి అంతా టీడీపీ సోషల్ మీడియాలో స్పష్టంగా కనపడుతోంది. టీడీపీ సోషల్ మీడియా గత రెండురోజులుగా జగన్ పర్యటనపైనే ఫోకస్ పెట్టింది. జనాల్ని ఎలా తరలిస్తున్నారు, ఎక్కడెక్కడినుంచి తెస్తున్నారు, బ్యారికేడ్లు కట్టారా లేదా..? ఇలా సాగింది టీడీపీ శూల శోధన.
చేసింది మేమే..
గతంలో ఎప్పుడూ కుప్పంకు అది చేశాం, ఇది చేశాం అని చెప్పుకోని చంద్రబాబు ఇప్పుడు ఏం చేశామనే విషయంపై ఓ డాక్యుమెంటరీ విడుదల చేశారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. ఓ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి రాష్ట్రానికి ఏం చేశామన్నది చెప్పుకోవాలి కానీ, తన నియోజకవర్గానికి ఏం చేశానో చెప్పుకునే స్థాయికి వచ్చారంటే దానికి కారణం జగనే. ఆ స్థాయిలో చంద్రబాబుని గ్రౌండ్ లెవల్ కి తీసుకొచ్చారు.
జ్ఞానోదయం అయినట్టేనా..?
కుప్పంలో స్థానిక ఎన్నికల్లో ఓడిపోయినప్పుడు వైసీపీ వాళ్లు ఓట్లు కొన్నారని విమర్శించారు, మున్సిపాల్టీ పోయినప్పుడు టీడీపీ నేతల్ని బెదిరించారన్నారు, చంద్రబాబు పర్యటనలో వ్యతిరేకత వచ్చినప్పుడు మనుషుల్ని పెట్టి మేనేజ్ చేశారని విమర్శించారు. తీరా ఇప్పుడు జగన్ వచ్చిపోయిన తర్వాత సభ ఫ్లాప్ అయిందని మాట్లాడుతున్నారు. అంటే నష్టనివారణ చర్యలు తీసుకోవాల్సిన సందర్భంలో చంద్రబాబు ఇంకా ఆత్మస్తుతి - పరనిందపైనే ఆధారపడ్డారని తెలుస్తోంది. మొత్తమ్మీద కుప్పంలో ఇప్పటి వరకూ ఓ లెక్క, ఇకపై ఓ లెక్క అనేలా చేశారు సీఎం జగన్. కేవలం కుప్పం నియోజకవర్గానికి సంబంధించిన కార్యక్రమంతో సరిపెట్టకుండా రాష్ట్రస్థాయి కార్యక్రమానికి కుప్పంను వేదిక చేసుకుని అక్కడ వైసీపీ నేతల్లో భరోసా నింపారు. పరోక్షంగా చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తించారు. ఇక కుప్పంకు చంద్రబాబు చేసిందేంటి.. చేయాల్సిందేంటి.. అనేదానిపైనే ఆయన భవిష్యత్తు ఆధారపడి ఉంది. ఇప్పటికే మంగళగిరికి సొంత నిధులు ఖర్చు చేసి రోడ్లు వేయిస్తూ, తోపుడు బండ్లు పంపిణీ చేస్తున్న లోకేష్ లాగే.. ఇప్పుడు చంద్రబాబు కూడా సొంత నిధులతో కుప్పంలో అభివృద్ధి పనులు చేపట్టాల్సిందే. లేకపోతే వైసీపీ ఎదురుదాడిని అక్కడ టీడీపీ తట్టుకునేలా లేదు..