హోదా ఇవ్వాల్సింది ప్రజలు.. జగన్ లేఖపై టీడీపీ కౌంటర్లు
జగన్ లేఖపై ఏపీ స్పీకర్ స్పందిస్తారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని అనుకోవడం పొరపాటే. అయినా కూడా జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది.
ప్రతిపక్ష హోదా కోరుతూ వైసీపీ అధినేత, ఏపీ అసెంబ్లీ స్పీకర్ కు రాసిన లేఖ ఇప్పుడు సంచలనంగా మారింది. గతంలో ప్రతిపక్ష హోదా విషయంలో చంద్రబాబుపై అసెంబ్లీలోనే సెటైర్లు పేల్చిన జగన్, ఇప్పుడు హోదాకోసం లేఖ రాయడమేంటని ఎద్దేవా చేస్తున్నారు టీడీపీ నేతలు. సీఎం హోదా అయినా, ప్రతిపక్ష నేత హోదా అయినా ఇవ్వాల్సింది ప్రజలని గుర్తు చేస్తున్నారు. సీఎంగా ఉండే అర్హతే కాదు, కనీసం ప్రతిపక్ష నేతగా కూడా ఉండే అర్హత జగన్ కోల్పోయారని, ప్రజలు అలాంటి తీర్పునిచ్చారని చెప్పారు జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు. ఇప్పటికైనా జగన్ తన తప్పులు తెలుసుకోలేకపోతే భవిష్యత్ లో మరింత నష్టపోవాల్సి ఉంటుందన్నారాయన.
జగన్ బెదిరింపు రాజకీయాలకు కాలం చెల్లిందని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో రాజకీయాలు చేయాలని సూచించారు విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్. అలా చేయకపోతే ఇప్పుడున్న క్రికెట్ టీమ్ కాస్తా వాలీబాల్ టీమ్ అవుతుందని కౌంటర్ ఇచ్చారు. ప్రజలు వైసీపీని ఘోరంగా ఓడించినా.. చంద్రబాబు పెద్దమనసుతో అసెంబ్లీలో జగన్ కు గౌరవం ఇవ్వాలని చెప్పినట్టు గుర్తు చేశారు గొట్టిపాటి. అందుకే అర్హత లేకున్నా అసెంబ్లీలో ఆయనకు గౌరవం లభించిందని, ఆయన వాహనాన్ని లోపలకు అనుమతించారని చెప్పారాయన. స్పీకర్ ని లక్ష్యంగా చేసుకుని జగన్ వక్రభాష్యంతో లేఖ రాశారని మండిపడ్డారు మంత్రి గొట్టిపాటి.
జగన్ లేఖపై ఏపీ స్పీకర్ స్పందిస్తారని, వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇస్తారని అనుకోవడం పొరపాటే. అయినా కూడా జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. ఆ లేఖ వల్ల వైసీపీకి వచ్చే లాభం ఏంటో తెలియదు కానీ.. గతంలో ఆయన అసెంబ్లీలో అన్న మాటల్ని మళ్లీ ఇప్పుడు హైలైట్ చేస్తూ ట్రోలింగ్ జరుగుతోంది. జగన్ లేఖను తమకు అనుకూలంగా మార్చుకుని సెటైర్లు పేలుస్తున్నారు టీడీపీ నేతలు.