పేదలు, పెత్తందార్లు.. చంద్రబాబు టార్గెట్ అదేనా..?
తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత అనంతరం ఇతర జిల్లాల్లో పార్టీ ఆఫీస్ ల నిర్మాణాలను తెరపైకి తెస్తోంది టీడీపీ. మిగతా చోట్ల కూడా ఆన్నీ అక్రమ నిర్మాణాలేనంటూ ఫొటోలతో సహా కథనాలిస్తున్నారు.
ఏపీ ఎన్నికల వేళ అప్పటి సీఎం జగన్ పదే పదే ప్రచారంలో ఒక పోలిక చెబుతుండేవారు. ఈ ఎన్నికలు.. పేదలు, పెత్తందార్లకు మధ్య జరుగుతున్నాయని అనేవారు. తమ ప్రభుత్వ పథకాల లబ్ధి పొందుతున్న పేదలకు, కూటమి కట్టిన పెత్తందార్లకు మధ్య ఈ పోరు కొనసాగుతోందని.. పేదల పక్షాన తాను నిలబడ్డానని చెప్పేవారు. కానీ ఎన్నికల్లో జగన్ లెక్క తప్పింది. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. పెత్తందార్ల కూటమి అంటూ అప్పట్లో జగన్, చంద్రబాబుని టార్గెట్ చేయగా.. ఇప్పుడు సీఎం హోదాలో బాబు తన ప్రత్యర్థులే పెత్తందార్లు అని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే వైసీపీ కార్యాలయాల భవనాలు మీడియా, సోషల్ మీడియాలో హైలైట్ అయ్యేలా చేస్తున్నారు.
రుషికొండతో మొదలు..
జగన్ కి ప్యాలెస్ లు ఉన్నాయి, ఆయన లైఫ్ స్టైల్ లగ్జరీగా ఉంటుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. అసలైన పెత్తందారు ఆయనేనంటూ విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో వారికి రుషికొండ భవనాలు బాగా పనికొచ్చాయి. జగన్ తనకోసం నిర్మించుకున్న రుషికొండ ప్యాలెస్ ఎంత లగ్జరీగా ఉందో చూడండి అంటూ దాదాపు నాలుగు రోజులపాటు టీడీపీ అనుకూల మీడియా వరుస కథనాలతో హోరెత్తించింది. బాత్ టబ్ దగ్గర్నుంచి, టైల్స్ వరకు.. ఫలానా ఐటమ్ రేటు ఇంత..? ఫలానా ఐటమ్ అక్కడినుంచి ఇంపోర్ట్ చేశారంటూ.. వివరాలతో విమర్శలు ఎక్కుపెట్టారు.
ఇప్పుడు పార్టీ ఆఫీస్ లు..
వైసీపీ ఆఫీస్ లను టీడీపీ ఇప్పుడు హైలైట్ చేస్తూ ఆరోపణలు చేస్తోంది. తాడేపల్లిలో వైసీపీ కార్యాలయం కూల్చివేత అనంతరం ఇతర జిల్లాల్లో పార్టీ ఆఫీస్ ల నిర్మాణాలను తెరపైకి తెస్తోంది. మిగతా చోట్ల కూడా ఆన్నీ అక్రమ నిర్మాణాలేనంటూ ఫొటోలతో సహా కథనాలిస్తున్నారు. 26 జిల్లాల్లో 42.24 ఎకరాలు ప్రభుత్వ భూమిని పార్టీ ఆఫీస్ లకోసం నామమాత్రపు లీజుకి తీసుకున్నారని చెబుతున్నారు. ఎకరాకి కేవలం వెయ్యిరూపాయలు చెల్లించి 33 ఏళ్ళు లీజుకి తీసుకున్నారని, ఆ 42.24 ఎకరాల భూమి విలువ రూ.688 కోట్లు కాగా, ఆ 26 ఆఫీస్ ల నిర్మాణానికి రూ.500 కోట్లకు పైగా ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రకాశం జిల్లాలో మినహా మిగతా 25చోట్ల పార్టీ ఆఫీస్ ల నిర్మాణానికి అనుమతి లేదని అంటున్నారు టీడీపీ నేతలు. మొత్తమ్మీద.. జగన్ ని టార్గెట్ చేసేందుకు, ఇప్పుడు వారికి మరో అవకాశం లభించింది. తాడేపల్లి ఆఫీస్ కూల్చివేతపై వైసీపీకి సింపతీ లభించకుండా.. మిగతా జిల్లాల్లో పార్టీ ఆఫీస్ ల గురించి కథనాలు ప్రచారంలోకి తెస్తున్నారు టీడీపీ నేతలు. ఈ విమర్శలకు జగన్ ఏమని సమాధానం చెబుతారో చూడాలి.