చంద్రబాబుకు దెబ్బ.. తోక ముడిచిన మహాసేన రాజేశ్‌

మహాసేన రాజేశ్‌కు పి.గన్నవరం టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు.

Advertisement
Update:2024-03-02 17:33 IST

పోటీ నుంచి తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అభ్యర్థి మహాసేన రాజేశ్‌ తప్పుకున్నాడు. పి.గన్నవరం నియోజ‌క‌వ‌ర్గ అభ్యర్థిగా ఆయనను టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఆయన అభ్యర్థిత్వాన్ని వ్యతిరేకిస్తూ జనసేన కార్యకర్తలు మాత్రమే కాకుండా టీడీపీ కార్యకర్తలు కూడా ఆందోళనలకు దిగారు. రాజేశ్‌ గతంలో టీడీపీకి, జనసేనకు వ్యతిరేకంగా పెట్టిన పోస్టులను వైరల్‌ చేస్తూ తిట్టిపోస్తున్నారు.

మహాసేన రాజేశ్‌ను పోటీ నుంచి తప్పించాలని డిమాండ్‌ చేస్తూ అంబాజీపేటలో జరిగిన సమన్వయ కమిటీ సమావేశంలో జనసేన కార్యకర్తలు రెచ్చిపోయారు. అదే డిమాండ్‌తో టీడీపీ పార్లమెంటరీ ఇన్‌చార్జ్‌ హరీష్‌ మాధుర్‌ కారును జనసేన కార్యకర్తలు ధ్వంసం చేశారు.

మరోవైపు మహాసేన రాజేశ్‌కు పి.గన్నవరం టికెట్‌ ఇవ్వడాన్ని నిరసిస్తూ బ్రాహ్మణ సంఘం నాయకులు శుక్రవారం విశాఖపట్నంలోని టీడీపీ ప్రధాన కార్యాలయాన్ని ముట్టడించారు. రాజేశ్‌కు టికెట్‌ ఇచ్చి బ్రాహ్మణులను టీడీపీ అవమానించిందని వారు విమర్శించారు.

హిందూ దేవుళ్లు, మహిళలపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసిన మహాసేన రాజేశ్‌పై పలు హిందూ సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. రాజేశ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, రాజకీయాల నుంచి ఆయనను బహిష్కరించాలని డిమాండ్‌ చేశాయి. రాజేశ్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ గోకవరం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశాయి. పరిస్థితిని గమనించిన మహాసేన రాజేశ్‌ తాను బరి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు.

మహాసేన రాజేశ్‌కు అసెంబ్లీ టికెట్‌ కేటాయించడం, పోటీ నుంచి ఆయన తప్పుకోవాల్సిన అనివార్య పరిస్థితులు ఏర్పడడం చంద్రబాబుకు పెద్ద దెబ్బ. అతనికి టికెట్‌ కేటాయించినప్పటి నుంచే చంద్రబాబుపై విమర్శలు వస్తున్నాయి.

Tags:    
Advertisement

Similar News